మత్స్యావతారంలో సమ్మోహనపర్చి..
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు మంగళవారం వైభవోపతంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు తొలి రోజు మతా్‌స్య్‌వతారంలో దర్శనమివ్వగా తిలకించిన భక్తులు పులకించారు. స్వామివారి అవతారాన్ని చూసి సమ్మోహనాభరితులయ్యారు. మొదట ఉత్సవాల నిర్వహణకు గర్భగుడిలో మూలమూర్తుల వద్ద అర్చకులు అనుజ్ఞ తీసుకున్నారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను, ఆళ్వార్లను మేళతాళాల నడుమ బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. సేవాకాలం, ప్రబంధాలు పఠించారు. వైదిక సిబ్బందికి ఆలయ ఈఓ ఎల్.రమాదేవి దీక్షా వస్త్రాలు అందజేశారు.
మిథిలా వేదికపై..
బేడా మండపంలో పూజల అనంతరం స్వామివారిని మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. భక్తుల దర్శనానంతరం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించి తిరిగి ఆలయంలో వేంచేయింపజేశారు. ఉత్సవాల సందర్భంగా ధ్వజస్తంభం వద్ద, ఉపాలయాలను పూలతో అందంగా తీర్చిదిద్దారు. పూలతోనే ‘జై శ్రీరామ్’, ‘శ్రీ రామాయనమః’ అని అలంకరించగా భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు విజయరాఘవన్, స్థానాచార్యులు స్థలశాయి, ఇన్‌చార్జ్ ప్రధానార్చకులు కోటి రామస్వరూప్, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మిథిలా స్టేడియం వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
నేడు కూర్మావతారం..
అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ ఆది మాహావిష్ణువు స్వరూపడైన సీతారామచంద్రస్వామి వారు బుధవారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వన్నునారు. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకుని అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధగిరి మునిగిపోయింది. దీంతో దేవతలు, రాక్షసుల ప్రార్థన మేరకు శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మంధర పర్వతాన్ని తన వీపుతో పైకెత్తి సహాయపడ్డాడు. ఈ అవతారాన్ని దర్శిస్తే శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.
ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
నేడు కూర్మావతారంలో రామయ్య దర్శనం
Comments
Please login to add a commentAdd a comment