● సీఎంతో చర్చించి జీఓ 76ను పునరుద్ధరిస్తాం ● ఇల్లెందు అ
ఇల్లెందు: రాష్ట్రంలో సింగరేణి వ్యాప్తంగా పట్టాల సమస్య ఉందని, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి జీఓ నంబర్ 76ను పునరుద్ధరించడం ద్వారా ఈ సమస్య పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఇల్లెందులో నిర్మించిన డిజిటల్ గ్రంథాలయాన్ని, పాఖాల రోడ్డు, సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రూ.4 కోట్లతో చేపట్టే బుగ్గువాగు సుందరీకరణ పనులకు, 22వ వార్డులో రూ. 2.41 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి, 23వ వార్డులో రూ.1.31 కోట్లతో నిర్మించనున్న పీహెచ్‌సీ పనులకు, రూ.55 లక్షలతో చేపట్టిన మున్సిపల్ గెస్ట్‌హౌస్‌ను పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మహాలక్ష్మి, గృహజ్యోతి, సబ్సిడీ గ్యాస్ వంటి పథకాలు అమలు చేస్తుండగా, ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మత ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను సైతం అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, ఈ విషయంలో ఎవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. కొందరు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని కోరారు.
మున్సిపల్ పాలకవర్గం సేవలు భేష్..
ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఐదేళ్లలో పట్టణాభివృద్ధికి విశేష కృషి చేశారని మంత్రి పొంగులేటి అభినందించారు. మున్సిపల్ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే టాప్ –5లో ఇల్లెందు నిలవడం విశేషమన్నారు. కేంద్ర రారష్ట్‌ర అవార్డులతో పాటు పట్టణ సుందరీకరణ దిశగా పరుగులు పెట్టించారని అన్నారు. మరో నాలుగు రోజుల్లో పాలకవర్గ పదవీ కాలం ముగియనుందని, భవిష్యత్‌లోనూ ఈ సభ్యులకే ప్రజల ఆశీస్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలో దొంగల బెడద నివారణకు 24 వార్డుల్లో సీఎస్సార్ నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పలు వార్డులకు మిషన్ భగీరథ నీరు రావటం లేదని, ట్యాంకులు అసంపూర్తిగా ఉన్నాయని కౌన్సిలర్ నవీన్ మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే పూర్తి చేయించాలని కమిషనర్ శ్రీకాంత్‌కు సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ డీవీ, వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు సభ్యులను మంత్రి సత్కరించి మెమెంటో అందజేశారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ఇల్లెందు మున్సిపాల్టీకి దేశ, రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు రావడానికి పాలకవర్గ సభ్యులతో పాటు వర్కర్లు కృషి చేయడమే కారణమన్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ మున్సిపల్ పాలక వర్గం కృషి ఇల్లెందు అభివృద్ధితో ముడిపడి ఉందన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ మాట్లాడుతూ తాను రాష్ట్రంలో ఓ చోట మున్సిపల్ కమిషనర్‌గా పని చేశానని, ఇల్లెందు మున్సిపాల్టీ ఏనాడు చూసినా అగ్రస్థానంలో ఉండేదని అన్నారు. సమావేశంలో ఇల్లెందు, భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్, ఆర్‌డీఓ మధు, డీఎంహెచ్‌ఓ భాస్కర్, ఆర్‌అండ్‌బీ ఈఈ వడ్లమూడి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె రహదారులను మెరుగుపరుస్తాం
ఇల్లెందురూరల్: ప్రతి పల్లెకు బీటీ రహదారి సౌకర్యాన్ని కల్పిస్తూ అంతర్గత రహదారుల మెరుగుదలకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం ప్రధాన రహదారికి అనుసంధానంగా రాఘబోయినగూడెం వద్ద రూ.2 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమంతోపాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఇల్లెందు మండలంలో నెలకొన్న సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, ప్రజలకు మంచి జరిగేందుకు అవసరమైన అన్ని పనులూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment