భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి విలాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్త రామదాసు నిర్మించిన దసరా మండపంలో బుధవారం ఈ వేడుక నేత్రపర్వంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని మేళతాళాలు, మహిళా భక్తుల కోలాటాలు, భక్తుల శ్రీరామ నామ స్మరణల నడుమ పల్లకీ సేవగా తీసుకొచ్చి మండపంలో కొలువుదీర్చారు. అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు చేశాక స్వామివారికి హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వేడుకల్లో వైద్యులు ఎస్.ఎల్. కాంతారావు, బి. సుబ్బరాజు, రామారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా విలాసోత్సవాలు గురువారంతో ముగియనుండగా, 26వ తేదీన బేడా మండపంలో విశ్వరూప సేవ నిర్వహించనున్నారు.
రామయ్యకు స్నపన తిరుమంజనం..
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి బుధవారం స్నపన తిరుమంజనం, నిత్యకల్యాణం జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
రామాలయంలో 26న విశ్వరూప సేవ
Comments
Please login to add a commentAdd a comment