![విద్య](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06mng101-192037_mr-1738867189-0.jpg.webp?itok=TWYgsxie)
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
కరకగూడెం: విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని భద్రాచలం ఐటీడీఏ డీడీ మణెమ్మ సూచించారు. గురువారం మండల పరిధిలోని చిరుమళ్ల ఆశ్రమ పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల అభ్యసనా స్థాయిని మెరుగుపరచాలని చెప్పారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆ తర్వాత పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ అశోక్, హెచ్‌ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసు నమోదు
ములకలపల్లి: గిరిజనుడిని దూషించిన వ్యక్తిపై గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. చౌటిగూడేనికి చెందిన ఊకే రవి జూనియర్ అడ్వకేట్‌గా ప్రాక్టిస్ చేస్తున్నాడు. ఆదివాసీ సేన రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తమ్మిశెట్టి గుర్రాజులుకు సంబంధించిన నివాస స్థల విషయం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో గుర్రాజులు సోమవారం రవి ఇంటికి వచ్చి వాటర్ ట్యాంక్ ఎక్కి చనిపోతున్నానని బెదిరింపులకు పాల్పడ్డాడు. తన ఇంటి నిర్మాణానికి అడ్డువస్తున్నారని కులం పేరుతో రవిని దూషించాడు. చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత గుర్రాజులు భార్య కూడా వచ్చి దూషణకు పాల్పడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ఏఆర్ ఎస్సై మృతితో
మాణిక్యారంలో విషాదం
ఇల్లెందురూరల్: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన సూర్ణపాక లక్ష్మీనర్సు (38) గురువారం ములుగు జిల్లా పస్రాలో ఆత్మహత్య చేసుకున్నాడు. కరకగూడెం పోలీసుస్టేషన్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తుండగా, అతని భార్య సునీత పస్రా సమీపంలోని గోవిందరావుపేటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బుధవారం పస్రాలోని ఇంటికి వెళ్లిన ఆయన ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీనర్సు మృతి పట్ల మాణిక్యారం గ్రామపెద్దలు, మాస్‌లైన్ నాయకులు సంతాపం తెలిపారు. ఏఆర్ ఎస్‌ఐ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
ద్విచక్ర వాహనదారుడిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: రోడ్డు ప్రమాద ఘటనలో ద్విచక్ర వాహనదారుడిపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సోములగూడెం గ్రామానికి చెందిన గద్దల సూర్యానారాయణ ఈ నెల 2న ఇందిరానగర్ కాలనీ పెట్రోల్‌బంక్‌లో ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకుని యూటర్న్ తీసుకుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ద్విచక్రవాహనదారుడు సతీష్ ఢీకొట్టడంతో సూర్యానారాయణకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడి కుమారుడు శ్రవణకుమార్ ఫిర్యాదుతో సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు.
![విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06yld54-192010_mr-1738867189-1.jpg)
విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
Comments
Please login to add a commentAdd a comment