![ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు మృతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06wra46-191066_mr-1738867189-0.jpg.webp?itok=Eu5zAMaA)
ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు మృతి
కారేపల్లి: ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో యువకుడు మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం పేరుపల్లి–జమాళ్లపల్లి మధ్య బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీ వేములవాడకు చెందిన కల్తి విజయ్(30) ద్విచక్రవాహనంపై బుధవారం రాత్రి పేరుపల్లి వైపు వస్తుండగా మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఫెన్సింగ్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, కుటుంబీకుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్‌ఐ ఎన్.రాజారాం తెలిపారు.
పురుగుల మందు తాగి యువతి...
అశ్వారావుపేటరూరల్: పురుగుల మందు తాగిన యువతి గురువారం మృతి చెందింది. ఏఎస్సై పడాల వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన సోయం శిరోమణి(19) ఇంట్లో పనులు చేయడం లేదని తల్లి రత్తమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది గత నెల 15న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు గత నెల 27వ తేదీ వరకు చికిత్స అందించి ఇంటికి పంపించారు. యువతి ఈ నెల 1న మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్న క్రమంలోనే పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
గిట్టని వ్యక్తిని పోలీసులకు పట్టించాలని పథకం
ఏన్కూరు: ఎవరిపైన అయినా కోపం ఉంటే గొడవ పెట్టుకోవడం, ఘర్షణ పడేవారిని మనం చూస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం జిలెటిన్ స్టిక్స్‌ను సదరు వ్యక్తి ఇంట్లో పెట్టి పోలీసులకు పట్టించాలని పథకం పన్నగా.. స్టిక్స్ తీసుకెళ్తున్న వ్యక్తే పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొత్తమేడేపల్లికి చెందిన కొరసం రమేష్‌కు గ్రామానికే చెందిన గంగరాజుతో గొడవలు ఉన్నాయి. దీంతో గంగరాజును పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న రమేష్ జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లను ఆయన ఇంట్లో పెట్టేందుకు సిద్ధమయ్యాడు. వీటిని కొనుగోలు చేసి ద్విచక్రవాహనంపై వస్తుండగా మండలంలోని జన్నారం క్రాస్ వద్ద వద్ద గురువారం చేపట్టిన తనిఖీల్లో పోలీసులు గుర్తించారు. ఈమేరకు రమేష్‌ను విచారించగా విషయం చెప్పడంతో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని ఆయనను రిమాండ్ తరలించారు. తనిఖీల్లో ఎస్‌ఐ రఽఫీ, హెడ్ కానిస్టేబుల్ కొండయ్య, ఉద్యోగులు రవి, సైదా పాల్గొన్నారు.
కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య
ఎర్రుపాలెం: మండలంలోని తక్కెళ్లపాడుకు చెందిన వివాహిత అయిలూరి శ్రీలత(33) ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. గురువారం ఉదయం కడుపునొప్పి అధికమవడంతో భరించలేక ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శ్రీలత తండ్రి శీలం బ్రహ్మానందరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.
జిలెటిన్ స్టిక్స్‌తో
వెళ్తుండగా అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment