బూర్గంపాడు: కంచే చేను మేసిన చందంగా ఎల్‌ఐసీ ఏజెంటే నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి బతికున్న వ్యక్తికి బీమా సొమ్ము ఇప్పించాడు. అందులో అగ్రభాగం తాను తీసుకుని సహకరించిన వారికి కొంత ముట్టజెప్పిన ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సారపాకలోని భాస్కర్‌నగర్‌కు చెందిన భూక్యా శ్రీరాములు పేరున ఓ ఎల్‌ఐసీ ఏజెంట్ జీవిత బీమా చేయించాడు. కాగా, ఆరు నెలల క్రితం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మరో ఏజెంట్.. శ్రీరాములు, మరో వ్యక్తితో కలిసి బీమా సొమ్ము కాజేసేందుకు పథకం రచించాడు. శ్రీరాములు మరణించినట్లు ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు నుంచి నకిలీ డెత్ సర్టిఫికెట్ సంపాదించారు. డెత్ సర్టిఫికెట్, బీమా సొమ్ము అందించాల్సిన నామినీ వివరాలను భద్రాచలంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో అందజేశారు. దీంతో ఎల్‌ఐసీ అధికారులు రూ.10 లక్షల బీమా చెక్కును శ్రీరాములు కుటుంబానికి రెండు నెలల క్రితం అందించారు. అందులో రూ. 5.50 లక్షలు ఎల్‌ఐసీ ఏజెంట్, రూ. 3.50 శ్రీరాములు కుటుంబం, మరో రూ.లక్ష సహకరించిన వ్యక్తి పంచుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై కొంతమేర సమాచారం తెలిసిన వ్యక్తి.. తనకు డబ్బులు ఇవ్వకపోవడంతో విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్‌ఐసీ అధికారులు గురువారం శ్రీరాములు ఇంటికి వెళ్లగా అతడు బతికే ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే భద్రాచలంలోని ఎల్‌ఐసీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. కాగా, సాయంత్రానికి ఈ ముగ్గురి నుంచీ రూ. 10 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఎల్‌ఐసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది.
బీమా సొమ్ము కాజేసిన పాలసీదారుడు,
ఎల్‌ఐసీ ఏజెంట్
నేనసలు ఎల్‌ఐసీ కట్టనేలేదు..
భాస్కర్‌నగర్‌కు చెందిన భూక్యా శ్రీరాములు పేరున ఏడేళ్ల క్రితం నుంచి జీవిత బీమా చెల్లిస్తున్నారు. రూ.10 లక్షలకు బీమా చేసి ప్రతి ఏటా రూ. 25 వేలు ప్రీమియం చెల్లిస్తున్నారు. అయితే తాను ఇంతవరకు ఎల్‌ఐసీ చేయలేదని, తన పేరున ఎవరు ఎల్‌ఐసీ చేశారో, ప్రీమియం ఎవరు చెల్లిస్తున్నారో తనకు తెలియదని శ్రీరాములు చెప్పిన్నట్లు సమాచారం. ఏదో డబ్బులు వస్తాయంటే తాను ఈ పనికి ఒప్పుకున్నట్లు అంగీకరించాడని తెలిసింది. అయితే పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment