సాక్షి, బెంగళూరు : డిజిటల్ టెక్నాలజీ సంస్థ హ్యాపియెస్ట్ మైండ్స్ బంపర్ ఐపీవో ద్వారా కంపెనీ కోఫౌండర్ అశోక్ సూతా తన ప్రత్యేకతను చాటుకున్నారు. భారతదేశ సమాచార సాంకేతిక సేవల పరిశ్రమకు మార్గదర్శకుడిగా పేరొందిన సూతా రెండు అతిపెద్ద ఐపీవోలను విజయవంతం చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశంలోని అతిపెద్ద, విప్రో లిమిటెడ్‌తో సహా మూడు అవుట్‌సోర్సింగ్ కంపెనీలకు నాయకత్వం వహించిన అశోక్ సూతా తాజాగా మరో జాక్‌పాట్ కొట్టేశారు. ఈ వారంలో ఆయన స్టార్టప్ కంపెనీ హ్యాపీస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ 151 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ కావడం ఆయన వ్యాపార దక్షతకు అద్దం పట్టింది. 23.3 మిలియన్ల షేర్లను ఆఫర్ చేయగా 3.51 బిలియన్ షేర్లకు బిడ్లను సాధించింది. దీంతో తొలిసేల్ లోనే ఈ దశాబ్దంలో దేశంలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. తన వాటాలో కొంత భాగాన్ని అమ్మడం ద్వారా 140 కోట్ల రూపాయలను ఆయన సాధించారు. వచ్చే వారం షేర్ల ట్రేడింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అశోక్ సూతా విశ్వసనీయతే ఈ రికార్డు ఐపీవోలకు కారణమని ముంబైలోని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి అభిమన్యు వ్యాఖ్యానించారు. తాజా ఐపీవో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, సంస్థాగత, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని మరింత పెంచిందన్నారు. ఈ ఐపీవో ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ భారతీయ మార్కెట్లో ప్రీమియాన్ని ప్రతిబింబిస్తుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ లిమిటెడ్ పరిశోధన విభాగాధిపతి దీపక్ జసాని అన్నారు.
అశోక్ సూతా ప్రస్థానం
అశోక్ సూతా (77) 1942 నవంబర్ 12న జన్మించారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టా పొందిన సూతా 1965లో శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం 1984 నుంచి 1999 వరకు విప్రో ఇన్ఫోటెక్ ప్రెసిడెంట్‌గా తన ప్రతిభను చాటుకున్నారు. ఐఐటి రూర్కీ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేసిన సూతా విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీని ఆకర్షించారు. తన నూతన ఐటీ బిజినెస్ కోసం సూతాను ఎంపిక చేశారు. తరువాతి14 సంవత్సరాలలోఅంచలంచెలుగా ఎదిగి విప్రో వైస్ చైర్మన్ అయ్యారు సూతా. తద్వారా దేశంలో టాప్ 3 ఐటీ కంపెనీల్లో ఒకదానిగా నిలిపారు. అయితే విప్రోనుంచి బయటికి వచ్చిన ఆయన మరో 9 మంది విప్రో ఉద్యోగులతో కలిసి1991లో మరో ఐటీ కంపెనీ మైండ్ ట్రీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా 2007 మార్చిలో ప్రకటించిన ఐపీవో 100 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయ్యి బ్లాక్‌బస్టర్ ఐపీవో సాధించడంతోపాటు, విలువైన కంపెనీగా మైండ్ ట్రీని తీర్చిదిద్దారు. ఇక 2011లో బెంగూళరులో హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ పేరుతో మరో కొత్త ఐటీ కంపెనీని ప్రారంభించారు. అంతేకాదు ఐపీవోలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. నిధుల సమీకరణలో ఆయన శైలి, ఐటీ రంగంలో అపారమైన అనుభవం హ్యాపియెస్ట్ ఐపీవోకు కలిసి వచ్చిన అదృష్టమని పరిశోధకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment