న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు రెండు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఈ జాబితాలో ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అల్లీడ్ బ్లెండర్స్, ఇంజినీర్డ్ క్వార్ట్‌జ్ తయారీ సంస్థ గ్లోబల్ సర్ఫేసెస్ చేరాయి. ఐపీవోలో భాగంగా అల్లీడ్ బ్లెండర్స్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థ మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఆఫీసర్స్ చాయిస్, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ, జాలీ రోగర్ రమ్, క్లాస్ 21 వోడ్కాసహా 10 ఐఎంఎఫ్‌ఎల్ లిక్కర్ బ్రాండ్లను కలిగి ఉంది.
దుబాయ్‌పై కన్ను
నేచురల్ స్టోన్స్ ప్రాసెసింగ్, ఇంజినీర్డ్ క్వార్ట్‌జ్ తయారీ కంపెనీ గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే సన్నాహాల్లో ఉంది. ఐపీవోలో భాగంగా 85.2 లక్షల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 25.5 లక్షల షేర్లను ప్రమోటర్లు మయాంక్ షా, శ్వేత షా విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను దుబాయ్‌లో గ్లోబల్ సర్ఫేసెస్ ఎఫ్‌జెడ్‌ఈ పేరుతో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) రూ. 198 కోట్ల ఆదాయం సాధించగా, రూ. 35.6 కోట్ల నికర లాభం ఆర్జించింది.
చదవండి: ఆగని రూపాయి పతనం, ఆర్బీఐ జోక్యం?
Comments
Please login to add a commentAdd a comment