హెడ్ కానిస్టేబుల్ దాతృత్వం
– హోంగార్డులకు హెల్మెట్ల పంపిణీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు పోలీసుశాఖలోని స్పెషల్ బ్రాంచ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మురళి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తాను కొనుగోలుచేసిన 30 హెల్మెట్లను పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న 30 మంది హోంగార్డులకు ఉచితంగా అందజేశారు. నగరంలోని పోలీసు అతిథి గృహంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చేతుల మీదుగా హోంగార్డులకు వీటిని అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్రవాహనం నడిపితే ప్రాణాలకు ముప్పనే విషయం గుర్తించుకోవాలని చెప్పారు. చిరుద్యోగి అయినప్పటికీ మురళి చేసిన సేవా కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ శివనందకిషోర్, డీఎస్పీ సాయినాథ్, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
చిరుత బాధిత రైతుకు
ఆర్థిక సాయం
చౌడేపల్లె: చిరుత దాడిలో మృతి చెందిన పాడి ఆవు యజమాని మండలంలోని కోటూరుకు చెందిన హుస్సేన్‌సాబ్‌కు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఎఫ్‌ఆర్వో వేణుగోపాల్‌బాబు కలిసి బుధవారం మదనపల్లెలో రూ.60 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. తవళం బీట్ పరిధిలో ఆగస్టు 18వ తేదీ చిరుతదాడిలో ఆవు మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ డీఆర్వో మదన్‌మోహన్, ఎఫ్‌బీఓ దీప, త్యాగరాజు పశువైద్య సిబ్బంది సహకారంతో పోస్టుమార్టం నిర్వహించారు. ఆవు యజమానికి ప్రభుత్వం రూ.60 వేల చెక్ మంజూరు చేసిందన్నారు. ఆర్థిక చేయూతనిచ్చిన అటవీశాఖకు, ప్రభుత్వానికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
రైలు నుంచి జారి పడి
వ్యక్తి దుర్మరణం
కుప్పంరూరల్: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కుప్పం–మల్లానూరు రైల్వే లైన్‌లో పులిగుండు వద్ద బుధవారం చోటుచేసుకుంది. కుప్పం రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కథనం మేరకు, ఉత్తర భారతదేశానికి చెందిన సుమారు 25 నుంచి 30 ఏళ్ల యువకుడు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు పశువుల కాపరులు తమకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించి కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. గుర్తు పట్టని విధంగా శరీర భాగాలు ఛిద్రమయ్యాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
రాష్ట్ర ఖోఖో పోటీలకు తీర్థం విద్యార్థిని
బైరెడ్డిపల్లె : మండలంలోని తీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ప్రత్యూష అండర్–17 విభాగంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం రత్నమ్మ తెలిపారు. విశాఖ పట్నం జిల్లా అనకాపల్లిలో నవరంబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఖోఖో పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
నీవానది పరిశీలన
గంగాధర నెల్లూరు: మండలంలోని మూడు గ్రామాల వద్ద నీవానది పరీవాహక ప్రాంతాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ అధికారులు బుధవారం పరిశీలించారు. మండలంలోని కొట్రకోన, ముక్కలతూరు, ఎల్లాపల్లె పంచాయతీల వద్దగల నీవానది నుంచి గత ప్రభుత్వంలో ఎంత మేరకు ఇసుక తరలించారు. ప్రస్తుతం ఎంత నిల్వలున్నాయి అనే విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ అధికారులు పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment