మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌

Published Thu, Oct 31 2024 2:32 AM | Last Updated on Thu, Oct 31 2024 2:32 AM

మీటర్

మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌

● ఒక మీటర్‌ రీడింగ్‌కు రూ.3.20 నుంచి రూ.2.80కి తగ్గింపు ● ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి ● రంగంలోకి యువగళం టీమ్‌

విజయపురం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వలంటీర్లు, మద్యంషాపులో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, మధ్యాహ్నం భోజనం కార్మికులు అంటూ వరుస కట్టి తొలగిస్తూ వచ్చింది. ఇప్పుడు విద్యుత్‌ మీటర్‌ బిల్లులు తీసే రీడర్లపై గురి పెట్టింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యుత్‌ శాఖలో 500 మందికి పైగా మీటర్‌ రీడర్స్‌ పనిచేస్తున్నారు. వీరు ప్రతి నెలా ఇంటింటికి వెళ్లి రీడింగ్‌ తీసి విద్యుత్‌ బిల్లులు అందిస్తే ఒక్కో బిల్లుకు నగరాల్లో రూ.3.60, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.3.73 పైసలు చొప్పున చెల్లించేవారు. వాటిని సంబంధిత కాంట్రాక్టర్లు రీడర్లకు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ పోనూ రూ.3.30 పైసలు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మీటర్‌ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాకే వేతనాలు జమ చేయాలని విద్యుత్‌ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రీడర్లు ఎలాంటి కోతల్లేకుండా నెలవారీ వేతనం అందుకునేవారు. అయితే కొత్తగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 2019–2024 వరకు ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి, తమ పార్టీకి అనుకూలమైన (యువగళం) నాయకులకు కాంట్రాక్టులను అప్పగించారు. సదరు కాంట్రాక్టరు రూ.3.30 కాకుండా రూ.2.80 మాత్రమే ఇస్తానని, ఇష్టం ఉంటే ఉండండి, లేకుంటే వెళ్లిపొండి అని బెదిరిస్తున్నారు. నిబంధనల మేరకు నూతన కాంట్రాక్టర్‌ మీటర్‌ రీడర్స్‌కు రీడింగ్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్‌ ఇవ్వాల్సి ఉంది, కానీ అది కూడా ఇవ్వనని, ఎవరికి వారే సమకూర్చుకోవాలని చెప్పడంతో మీటర్‌ రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎస్‌ఈని కలిసిన జిల్లా మీటర్‌ రీడర్‌ యూనియన్‌ నాయకులు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.

అభద్రతా భావంతో మీటర రీడర్లు

జిల్లాలో పని చేస్తున్న మీటర్‌ రీడర్లు అభద్రతా భావంతో ఉన్నారు. గత ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు దిశగా అడుగులు వేసినపుడు ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం గత సర్కారు తీసుకున్న విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో వేగవంతంగా కొనసాగుతోంది. వీటి ఏర్పాటుతో రీడర్లు ప్రతినెలా రీడింగ్‌ తీసి బిల్లుల ఇచ్చే పరిస్థితి ఉండదు. మొబైల్‌ రీచార్జి తరహాలో మీటర్లకు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మీటర్ల ఏర్పాటు పూర్తయితే రీడర్స్‌ అవసరం విద్యుత్‌ సంస్థకు ఉండదు. దీంతో 23 ఏళ్లపాటు సేవలందించిన వీరిని ఇంటికి పంపితే వీరి కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంటుంది.

గతం ప్రభుత్వం ఇచ్చినట్టే ఇవ్వాలి

గతంలో ఒక్కో విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌కు రూ.3.20 ఇస్తుండేవారు. నేడు రూ.2.80 మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదు. ప్రస్తుతం పెరిగి న నిత్యావసర ధరలకు కుటుంబం గడవటమే కష్టంగా ఉంది. కాంట్రాక్టర్లు తీసుకొన్న నిర్ణయం సరైనది కాదు. దీనిపై పోరాటం చేసి సాధించుకుంటాం. – బాబురెడ్డి, నాగలాపురం

15 ఏళ్లుగా పని చేస్తున్నాను

గత 15 ఏళ్లుగా తిరుపతిలో మీటర్‌ రీడర్‌గా పని చేస్తున్నారు. గత ప్రభుత్వం 3.20 ఇస్తే, ఈ ప్రభుత్వం రూ. 2.80 ఇస్తామని చెప్పడం సరికాదు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. మాకు రూపాయి పెంచాల్సింది పోయి ఇస్తున్న రేటు కంటే తగ్గిస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం. – ప్రభాకర్‌, తిరుపతి

ఎండనకా..వాననకా కష్టపడ్డాం

ప్రతి నెలా తొలి వారం నుంచి ఎండనకా..వాననకా కష్టపడ్డాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రాక్లరు మా కడుపు కొట్టడం సరికాదు. ప్రభుత్వం మారితే ఇప్పటి కంటే ఎక్కువగా వస్తారని ఆశపడ్డాం. కానీ ఉన్న దాన్ని తొలగించి, మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇష్టం ఉంటే ఉండండి లేకుంటే వెళ్లండి అని చెప్పడం సరైన పద్ధతి కాదు. – సయ్యద్‌, పాకాల

కాంట్రాక్టర్లు మా కడుపుకొడుతున్నారు

నా వయస్సు 60 యేళ్లు. గత 20 యేళ్లుగా మీటర్‌ రీడర్‌గా పని చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్లు మమ్మల్ని వద్దు వెళ్లమంటే మేము ఏ పని చేసుకోవాలి. తమ అనుకూలమైన వారికి కాంట్రాక్ట్‌ ఇచ్చి ఇలా మా బతుకులతో ఆడుకోవడం మంచిది కాదు. మాకు కమిషన్‌ పెంచుతూ, ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. – గంగులయ్య, మదనపల్లె

No comments yet. Be the first to comment!
Add a comment
మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌1
1/3

మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌

మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌2
2/3

మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌

మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌3
3/3

మీటర్‌ రీడర్లకు బాబు షాక్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement