● తిరుపతిలో ఎమ్మెల్యే ఆరణి చిత్రాలు ● టపాసుల విక్రేతల నుంచి మామూళ్ల రూపంలో గిఫ్ట్‌బాక్స్‌లు ● చిత్తూరులోని అనుచరులకు అందజేత
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వింత పోకడలకు తిరుపతివాసులు నివ్వెరపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని చిత్తూరుకు చెందిన తన అనుచరులకు అప్పగించడంపై కూటమి నేతలే బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు టపాకాయల దుకాణాల విషయంలో కూడా చేతివాటం ప్రదర్శించడంపై మండిపడుతున్నారు. నగరంలో దీపావళి పండుగ సందర్భంగా బాణ సంచా విక్రయాల నిమిత్తం పలు దుకాణాలకు కలెక్టర్ లైసెన్స్ మంజూరు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆయా దుకాణదారులను పిలిపించి ఒక్కొక్కరు 10 గిఫ్ట్‌బాక్స్‌లను తమకు అందించాలని హుకుం జారీ చేశారు. ఈ మేరకు అందరి వద్దా వసూలు చేశారు. అయితే ఈ గిఫ్ట్‌బాక్స్‌లను చిత్తూరులోని తన అనుచరులకు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నేతలు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే ఆరణిని గెలిపించేందుకు కష్టపడి పనిచేస్తే, ఏమాత్రం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అంశంలోనూ చిత్తూరు నుంచి వచ్చిన వలస నేతలకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడుతున్నారు.
నరక చతుర్దశి వేడుకల రద్దు
తిరుపతిలో నరక చతుర్దశి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సర్కారు సైతం రూ.9.9లక్షలు మంజూరు చేసింది. అయితే ఎమ్మెల్యే మాత్రం వేడుకలకు రూ.15లక్షలతో అంచనాలు రూపొందించారు. ఆ నిధులను విడుదల చేయాలని కార్పొరేషన్ కమిషనర్ మౌర్యను ఆదేశించారు. ఆమె ఈ ప్రతిపాదనకు విముఖత చూపారు. ప్రభుత్వం కేటాయించిన మొత్తంలోనే వేడుకలు జరిపించాలని స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే చివరకు నరక చతుర్దశి వేడుకలనే రద్దు చేసేశారు.
Comments
Please login to add a commentAdd a comment