విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ
● పకడ్బందీగా ‘టీచింగ్ అట్ రైట్ లెవల్’ ● విధుల్లో అలసత్వం వహించకూడదు ● శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంచేందుకు టీచర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాయింట్ కలెక్టర్ విద్యాధరి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం టీచింగ్ అట్ రైట్ లెవెల్ పేరుతో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణకు అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ విద్యార్థి దశ చాలా కీలకమన్నారు. ప్రాథమిక విద్య పటిష్టంగా ఉంటేనే ఉన్నత తరగతుల్లో రాణిస్తారని చెప్పారు. ప్రతి తరగతిలో బాగా చదివే విద్యార్థులతోపాటు వెనుకబడిన విద్యార్థులు కూడా ఉంటారని వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 3, 4, 5 తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా బృందాలను విభజించి వారి స్థాయికి అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించాలని సూచించారు. బోధనా అభ్యసన సామగ్రిని ఉపయోగించి బోధించాలన్నారు. అలా చేస్తే అభ్యసనా సామర్థ్యాలు పెరుగుతాయన్నారు.
అందరికీ విద్య
టీచర్లు ప్రతి విద్యార్థి స్థాయిని అర్థం చేసుకుని బోధించాలని ట్రైనీ కలెక్టర్ హిమ వంశీ సూచించారు. ఆట పాటలతో బోధన చేస్తే విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయన్నారు. టీచింగ్ అట్ రైట్ లెవల్ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. అందరికీ విద్య అందరి పాఠశాల కార్యక్రమంలో 6 నుంచి 15 ఏళ్లు కలిగిన ప్రతి ఒక్కరికీ విద్య అందించడం బాధ్యత అని పేర్కొన్నారు. ఉన్నత విద్య అందించేందుకు సమగ్రశిక్ష శాఖ సౌజన్యంతో టీచింగ్ అట్ రైట్ లెవెల్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థీ అంగన్‌వాడీ నుంచి ప్రాథమిక విద్య, ఉన్నత విద్య స్థాయికి వస్తారని చెప్పారు. వారికి ఏదో ఒక సందర్భంలో వయసుకు తగ్గ నైపుణ్యాలలో బేసిక్ లోపం ఉంటుందని చెప్పారు. ఆ లోపాలను సరిదిద్దేందుకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక దశలోనే చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను పెంపొందించడం నేర్పించాలన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచింగ్ అట్ రైట్ లెవల్ శిక్షణ టీచర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం ప్రదమ్ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు వినోద్ దీపక్ పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌లో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డీవైఈఓ చంద్రశేఖర్, సెక్టోరల్ అధికారులు ఉదయలక్ష్మి, జయప్రకాష్, నరోత్తమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment