మోడల్ పేపరే ప్రశ్నపత్రంగా..
గత కొద్ది రోజులుగా పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో రెండు సబ్జెక్టులకు సంబంధించి ముందస్తుగా ఇచ్చిన మోడల్ పేపర్‌నే మళ్లీ ప్రశ్నపత్రంగా విద్యార్థులకు అందజేసి పరీక్షలు రాయించారు. ఇలాంటి వింత ధోరణి రాష్ట్రంలోని ఏ అటానమస్ కళాశాలలోనూ ఉండదేమోనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అటానమస్ నియమ, నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి ముందస్తుగా బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్) మోడల్ పేపర్లను అందజేస్తారు. విద్యార్థుల ప్రిపరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని అవగాహన నిమిత్తం మాత్రమే మోడల్ పేపర్లను ఇస్తారు. అయితే పీవీకీఎన్ కళాశాలలో ముందస్తుగా ఇచ్చిన మోడల్ పేపర్లనే సెమిస్టర్ పరీక్షల్లో ప్రశ్నపత్రాలుగా విద్యార్థులకు ఇచ్చి పరీక్షలు రాయించారు. ఈ పరీక్షలు రెండూ ఈ నెల 11వ తేదీ నిర్వహించడం గమనార్హం. రెండో సంవత్సరం బీకాంకు సంబంధించి ఈ కామర్స్, వెబ్ డిజైనింగ్ ప్రశ్నపత్రం 75 మార్కులకు, రెండవ సంవత్సరం బీఎస్సీకి సంబంధించి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా (టైటిల్ ఆఫ్ ది కోర్స్) 75 మార్కులు ఇలా రెండు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు మోడల్ పేపర్‌నే అందజేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మిగిలిన పరీక్షల నిర్వహణ కూడా అనుమానాలకు తావిస్తోంది. పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ హోదా అధికారి ఉంటారు. ఆ కళాశాలలో ఆ హోదాలో విధులు నిర్వహిస్తున్న నాగేంద్ర అలసత్వం వల్ల ఈ తప్పిదం చోటు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్షల నిర్వహణే ఇలా సాగుతుంటే మిగతా పాలన ఇంకెలా ఉంటుందో అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ప్రశ్నపత్రాలు బయట నుంచి వస్తాయ్
సెమిస్టర్ పరీక్షల ప్రశ్నపత్రాలు మా కళాశాలలో రూపొందించం. అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు బయట ప్రాంతం నుంచే వస్తాయి. పరీక్షలు అటానమస్ నియమ, నిబంధనలకు లోబడే పకడ్బందీగా నిర్వహిస్తాం. బీఓఎస్ మోడల్ పేపర్ ప్రకారం ప్రశ్నపత్రం వచ్చే అవకాశం ఉండదు. అలా జరగడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. కాకపోతే ఏమైనా తప్పిదం జరిగి ఉండొచ్చేమో విచారణ చేస్తాను.
– డా.జీవనజ్యోతి, ప్రిన్సిపల్, పీవీకేఎన్ ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల
Comments
Please login to add a commentAdd a comment