సైనికుల సేవలు మరువలేనివి
● ఈ–బైక్ ర్యాలీనిప్రారంభించిన ట్రైనీ కలెక్టర్ హిమవంశీ
చిత్తూరు కలెక్టరేట్ : దేశ రక్షణ కోసం అనునిత్యం పోరాడే సైనికుల సేవలు ఎన్నటికీ మరువలేనివని ట్రైనీ కలెక్టర్ హిమవంశీ అన్నారు. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ ఆఫ్ డిఫెన్స్ ఈ–బైక్ ర్యాలీ మంగళవారం చిత్తూరుకు విచ్చేసింది. జిల్లా కేంద్రంలోని పోలీసు మైదానం వద్ద బైక్ ర్యాలీని ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, ఏఎస్పీ ఆపరేషన్స్ రాజశేఖర్‌రాజు జెండా ఊపి ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ సైనిక సేవ ఎంతో గొప్పదన్నారు. సైనికులు తమ కుటుంబాలను సైతం వదిలి దేశ రక్షణకు విధులు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. దేశంలోని ప్రజలు పోలీసుల సేవలను ప్రత్యక్షంగా చూస్తారని, అయితే సరిహద్దుల్లో పనిచేసే సైనికుల త్యాగాలను చాలా మంది చూడలేరన్నారు. కనిపించని నిజమైన హీరోలు సైనికులని కొనియాడారు. సైనికుల త్యాగం వెనుక ఎన్నో కలలు, బాధలు, ఆశలు ఉంటాయన్నారు. సైనికుల త్యాగాల ప్రతిఫలమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని చెప్పారు. ఏఎస్పీ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ మాజీ సైనికులు, వీరనారీలు, వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ ఉద్దేశం ఎంతో గొప్పదని కొనియాడారు. దేశానికి రక్షణ కవచంలా నిలిచే సైనికులు నిజమైన దేశభక్తులన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సరిహద్దుల్లో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు మాట్లాడుతూ నిజమైన స్వాతంత్య్రమంటే స్వేచ్ఛను పొందడమే కాకుండా దాన్ని కాపాడుకోవడమని, సైనికుల త్యాగాలు స్ఫూర్తినందిస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రతి పౌరుడు సైనికుల త్యాగాలను గుర్తించి, వారికి గౌరవం ఇవ్వాలని తెలిపారు. అనంతరం మాజీ సైనికులు, వీరనారీల సమస్యలను పరిశీలించి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ నోయెల్ వికాస్ మొనిస్, 95 ఏళ్ల ఎంఈజీ మాజీ సైనికుడు కెప్టెన్ చొక్కలింగ, సూపరింటెండెంట్ రజాక్ ఖాన్, వరదరాజులు, మాజీ సైనికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment