పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు
తవణంపల్లె: జిల్లాలో మినీ గోకులం పథకం కింద పాడి పశువుల షెడ్లు నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసిందని పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ తెలిపారు. మంగళవారం తవణంపల్లెలోని వెలుగు కార్యాలయంలో పాడి పశువుల షెడ్లు నిర్మాణంపై పాడి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జిల్లాలోని పాడి రైతులను దృష్టిలో ఉంచుకుని మినీ గోకులం పథకం కింద పాడి పశువుల షెడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేయడం జిల్లాలోని రైతుల అదృష్టం అన్నారు. అలాగే తవణంపల్లె మండలానికి ఎమ్మెల్యే చొరవతో జిల్లా కలెక్టర్ రూ.1.36 కోట్లతో 69 పాడి పశువుల షెడ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పాడి పశువుల షెడ్లు మంజూరైన రైతులు కాంట్రాక్టర్లతో సంబంధం లేకుండా సొంతంగా 40 రోజుల్లో షెడ్లు నిర్మించుకోవాలని సూచించారు. రైతులు మొత్తం పెట్టుబడి పెట్టుకోకుండా నాలుగు దశల్లో పనులు చేసుకుంటే చేసిన పనులకు ఎప్పటికప్పుడు ఎం.బుక్ రికార్డు చేయించి బిల్లులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతలు మేరకు నాణ్యతలో రాజీ లేకుండా పనులు చేపట్టాలని రైతులకు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే బిల్లులు మంజూరు చేయమని స్పష్టం చేశారు. ఆరు పశువుల షెడ్డు నిర్మాణానికి రూ.2.30 లక్షలు, నాలుగు పాడి ఆవుల షెడ్డు నిర్మాణానికి రూ.1.85 లక్షలు, రెండు ఆవుల షెడ్డు నిర్మాణానికి రూ.1.15 లక్షలు, 20 గొర్రెల షెడ్డు నిర్మాణానికి రూ.1.30 లక్షలు, 50 గొర్రెల షెడ్డు నిర్మాణానికి రూ.2.30 లక్షలు, 100 కోళ్లు పోషించడానికి షెడ్డు నిర్మాణానికి రూ. 87 వేలు, 200 కోళ్లు పోషించడానికి షెడ్డు నిర్మాణానికి రూ.1.32 లక్షల ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. నాలుగు స్టేజీల్లో పనులకు స్టేజీ స్టేజీకి బిల్లులు చేస్తామన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డీడీ అరీఫ్, ఐరాల ఏడీ పద్మావతి, ఎంపీడీఓ రెడ్డిబాబు, ఏపీఓ లలిత, జేఈ వెంకటరమణారెడ్డి, పశువైద్యాధికారి డాక్టర్ లావణ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment