వ్యక్తి అరెస్టు
వి.కోట: ఒక మహిళను మోసగించిన వ్యక్తిని శుక్రవారం వి.కోట పోలీసులు అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. డీఎస్పీ కథనం మేరకు.. మండలంలోని బోయచిన్నాగనపల్లి పంచాయతీ రామనాథపురంలో నివాసం ఉంటున్న ఎస్టీ కులానికి చెందిన ఒక మహిళను అదే గ్రామానికి చెందిన సతీష్ అలీయాస్ దినేష్ అనే వ్యక్తి ప్రేమించాడు. ఆ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాంఛలు తీర్చుకున్నాడు. తర్వాత ఆ మహిళకు తెలియకుండా మరో మహిళను వివాహం చేసుకుని ఎస్టీ మహిళను మోసగించాడు. దీనిపై కేసు నమోదు చేసి సతీష్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
22 కిలోల గంజాయి స్వాధీనం
తిరుపతి క్రైమ్: ఒడిశా నుంచి తిరుపతి మీదుగా చైన్నెకి తరలిస్తున్న 22 కిలోల గంజాయిని సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్టు తిరుపతి డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా పాత తిరుచానూరులోని ఓ హోటల్ వద్ద తిరుగుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు చిత్తూరు జిల్లాలోని కుప్పం, నగరి ప్రాంతాలకు చెందిన సాతుపాటి లోకేశ్వరరావు, కుమారిగా గుర్తించామన్నారు. వారిద్దరూ కలిసి గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఒడిశా నుంచి గంజాయిని పెద్ద మొత్తంలో తీసుకొచ్చి తిరుపతి పరిసరాలతో పాటు చైన్నెలో చిన్న చిన్న పొట్లాలు చేసి యువతకు అమ్మేవారని తెలిపారు. వీరి వద్ద నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గంజాయి విక్రయిస్తూ వీరు ఇరువురూ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డారన్నారు. అప్పుడు చిత్తూరు జైలు రిమాండ్ ఖైదీలుగా ఉండి బయటకు వచ్చిన అనంతరం తిరిగి పుత్తూరు, తమిళనాడు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. వీరిపై రైల్వే పోలీస్ స్టేషన్లో కూడా అక్రమంగా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు కేసులు ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment