ప్రజలకు అండగా నిలబడదాం
నగరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. సోమవారం నగరి పట్టణంలోని తన నివాస కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలక ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను బురిడీ కొట్టించిందన్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా పథకాలు ప్రజలకు అందలేదన్నారు. అర్హత ఉన్నా పెన్షన్లు తొలగించేస్తున్నారని ఆరోపించారు. కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదన్నారు. విద్యుత్ బిల్లులు పెరిగిపోతున్నాయని, నిత్యావసర సరకులు ప్రజలకు అందుబాటులో లేవన్నారు. ఈ అంశాలపై ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పార్టీ శ్రేణులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపుతూ ప్రజలకు అండగా ఉండాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, జెడ్పీటీసీ సభ్యులు గాంధీ, రాష్ట్ర మొదలియార్ సంఘం మాజీ డైరెక్టర్ బాలకృష్ణన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి, దేశమ్మ ఆలయ మాజీ చైర్మన్ వేణుబాబు, కౌన్సిలర్లు బీడీ భాస్కర్, బాబు, మురుగ, భూపాలన్, విజయపురం వైస్ ఎంపీపీ బాలాజీ, వడమాలపేట జెడ్పీటీసీ మాజీ సభ్యులు సురేష్‌రాజు, మునివేలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment