పింఛన్‌ కోతలు | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ కోతలు

Published Tue, Dec 10 2024 1:59 AM | Last Updated on Tue, Dec 10 2024 1:59 AM

పింఛన్‌ కోతలు

పింఛన్‌ కోతలు

కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్‌సిక్స్‌ అంటూ సంక్షేమ పథకాలతో ఊరించింది. అందులో పండుటాకులకు రూ.4 వేలు అంటూ వల వేసింది. నమ్మి ఓటేసిన వారికి ఇప్పుడు చంద్రబాబు సర్కారు పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. పింఛన్ల ఏరివేతకు పచ్చజెండా ఊపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రతి నెలా గుట్టుచప్పుడు కాకుండా పింఛన్లను తొలగిస్తూ రాగా.. తాజాగా బహిరంగంగానే పింఛన్ల ఏరివేతకు దిగింది. అందులో భాగంగా మండలంలోని ముత్తుకూరు సచివాలయాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని ప్రత్యేక బృందం పరిశీలన చేపట్టింది.
● జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పరిశీలనకు రంగం సిద్ధం ● మొదటి దశలో పైలెట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు మండలం ముత్తుకూరు సచివాలయం ● 22 మంది అధికారులు.. 11 బృందాలతో సర్వే ● ఒక టీంలో ఇద్దరు చొప్పున అధికారులు ● వితంతు, ఒంటరి మహిళల విషయంలో సంక్లిష్టమైన ప్రశ్నలు ● అయోమయంలో లబ్ధిదారులు

తనిఖీలో పరిశీలించిన అంశాలు..

● తనిఖీల్లో ప్రధానంగా ప్రభుత్వం దివ్యాంగులు, వితుంతు పింఛన్లపై పరిశీలన చేపట్టారు.

● పింఛన్‌దారుల్లో అన్ని కేటగిరీలకు సంబంధించి ఆ కుటుంబంలో ఎవరైనా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నారా?

● అర్బన్‌ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా ఇంటి నిర్మాణం ఉందా?

● విద్యుత్‌ వినియోగం మొత్తం 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తున్నారా ?

● లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరికైనా 4 చక్రాల వాహనం (ట్యాక్సీ, ట్రాక్టరు, ఆటో మినహా) వంటిది ఉందా?

● 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట, రెండు కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?

● కుటుంబంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్‌ ఉన్నారా?

● కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా ?

● ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నారా..?

● దివ్యాంగులకు సంబంధించి వికలత్వం కలిగి ఉన్నారా ?

● పింఛన్‌దారుడి (రీ అసెస్‌మెంటు)

● వైద్య పరీక్షకు సిఫారసు చేస్తున్నారా.. అనే ప్రశ్నలు ప్రత్యేకంగా ఉన్నాయి.

● వితంతువు, ఒంటరి మహిళలకు సంబంధించి పునర్వివాహం చేసుకున్నారా..? అనే ప్రశ్న ప్రత్యేకంగా ఉంది.

● వివరాలు తనిఖీ చేసిన పింఛన్‌దారుల నుంచి యాప్‌లో ఫేషియల్‌, బయోమెట్రిక్‌ తీసుకున్నారు.

చిత్తూరు రూరల్‌(కాణిపాకం): ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయలేక మొహం చాటేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా పండుటాకుల పింఛన్లను తొలగించేందుకు సిద్ధమైంది. పింఛన్ల పరిశీలనకు చిత్తూరు మండలంలోని ముత్తుకూరు సచివాలయాన్ని పైలెట్‌ ప్రాజెక్టుకు ఎంపిక చేసింది. సోమవారం సచివాలయ పరిధిలో 434 మంది పింఛన్ల పరిశీలనకు అధికారులు బృందంగా ఏర్పడ్డారు. మొత్తం 22 మంది రాగా 11 బృందాలుగా ఏర్పడి పింఛన్లను జల్లెడ పట్టారు. ప్రతి పింఛన్‌ను పరిశీలించి మొబైల్‌ యాప్‌లోని ప్రశ్నలకు జవాబులు అప్‌లోడ్‌ చేశారు. సాయంత్రానికి పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. బయటి ప్రాంతంలో ఉన్న లబ్ధిదారుల పరిశీలన మాత్రమే పెండింగ్‌లో పడింది.

పరిశీలనలో..

పింఛన్ల పరిశీలనలో తోతుగా విచారణ చేశారు. పైఅంశాల ఆధారంగా పలువురికి పింఛన్లు ఉంటాయా ? ఉండవా? అనే విషయాలు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కొన్ని పింఛన్లకు కోతలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికలాంగ పింఛన్ల లబ్ధిదారుల విషయంలో అనుమానం వచ్చి..పునః పరిశీలనలో పెట్టినట్లు తెలుస్తోంది. శారీరకంగా బాగున్నా పింఛన్‌ మంజూరువుతోందని విషయాన్ని గుర్తించినట్టు సమాచారం. ఇలా మరెన్నో పింఛన్లకు కోతలు పడే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.

రెండో విడతలో..

పైలెట్‌ ప్రాజెక్టు కింద జిల్లాకో సచివాలయంలో తనిఖీలు చేపడుతున్న కూటమి ప్రభుత్వం.. రెండవ దశలో మొత్తం పింఛన్ల తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపడుతున్న తనిఖీల్లో వెలుగు చూసే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు మండలంలో మొత్తం 4,500లకు పైగా పింఛన్లు ఉన్నాయి. మండలంలో అనర్హత పేరుతో కనీసం వందల సంఖ్యలో పింఛన్లను ఏరివేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ఏడాదిలో రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు అనర్హులున్నారని జూన్‌ నెల నుంచి ప్రచారం చేస్తూ వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement