సైనికుల సంక్షేమం.. | - | Sakshi
Sakshi News home page

సైనికుల సంక్షేమం..

Published Wed, Dec 11 2024 12:39 AM | Last Updated on Wed, Dec 11 2024 12:39 AM

సైనిక

సైనికుల సంక్షేమం..

● సాయుధ దళాల పతాక నిధికి విరాళాల సేకరణ ● ఏటా డిసెంబర్‌లో కార్యక్రమం నిర్వహణ ● 2022లో రూ.16 లక్షల నిధులు సేకరించిన ఎన్‌సీసీ కేడెట్లు ● గతేడాది సొంతంగా సేకరించగా వచ్చింది కేవలం రూ.2.25 లక్షలే ● సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి నిధుల వినియోగం ● తమవంతు విరాళాలు అందజేయాలంటున్న అధికారులు

దేశ రక్షణలో నిరంతరం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించే సైనికుల సంక్షేమం కోసం మనవంతు సాయం అందించే సమయం వచ్చింది. దేశం కోసం త్యాగం చేసే వారి సేవలు అజరామరం. అందువల్ల సైనికులకు, వారి కుటుంబాలకు చేయూత అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. యుద్ధభూమి నుంచి తిరిగి వచ్చిన సైనికులకు, వితంతువులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో ఏటా డిసెంబర్‌లో సాయుధ దళాల విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా విరాళాల సేకరించే పనిలో పడ్డారు.

మాజీ సైనికులకు

ప్రయోజనాలు.. రాయితీలు

● గ్రూప్‌ 2, 4లో రిజర్వేషన్లు

● వివాహానికి ఆర్ధిక సాయం రూ.40వేలు (ఇద్దరు కుమార్తెల వరకు)

● మాజీ సైనికుడు మరణిస్తే కుటుంబానికి రూ.10 వేలు, భార్య, కుమారుడు, కుమార్తె మరణించినా అంతే మొత్తం అందజేస్తారు.

● స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు తక్కువ వడ్డీపై రుణ సదుపాయం కల్పిస్తారు.

● ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు.

● సీఎస్‌ఓ క్యాంటీన్‌ ద్వారా వ్యాట్‌ మినహాయింపుపై సరుకులు పొందే అవకాశం

● మాజీ సైనికుల పిల్లల ఉన్నత చదువుకు కోర్సును బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.36 వేల వరకు అందిస్తారు. ఇందుకు కోర్సులో చేరిన మొదటి సంవత్సరంలోనే దరఖాస్తు చేసుకోవాలి.

సాయుధ దళాల పతాక దినోత్సవంలో పాల్గొన్న కలెక్టర్‌, సైనిక సంక్షేమ శాఖ అధికారులు (ఫైల్‌)

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లావ్యాప్తంగా సైనిక దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్‌సీసీ కేడెట్లు విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకు గుర్తుగా చిన్న స్టిక్కర్‌ను చేతికిస్తారు. కార్లు, ఇతర వాహనాలకు కాస్త పెద్ద స్టిక్కర్‌ అంటించి విరాళాలు అడుగుతారు. ఇలా సేకరించిన ధనాన్ని దేశం కోసం పాటుపడుతున్న సైనిక వ్యవస్థ, వారి కుటుంబం సంక్షేమం కోసం ఖర్చు చేస్తారు. గత సంవత్సరం సేకరించిన విరాళం చిత్తూరు జిల్లా నుంచి రూ.2.25 లక్షలు దాటలేదు. ఎన్‌సీసీ కేడెట్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేకరించడం వల్ల 2022లో రూ.16 లక్షల వరకు జమ అయింది. అయితే పలువురు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఎన్‌సీసీ కేడెట్లు క్షేత్రస్థాయికి వెళ్లి విరాళాలు సేకరించడం ఆపేశారు. దీంతో గత సంవత్సరం రూ.2.25 లక్షలకంటే ఎక్కువ సేకరించలేకపోయారు. ఈ ఏడాది సైతం కార్యాలయాలు, ప్రముఖ స్థలాల్లో, విద్యాసంస్థల వద్ద విరాళం సేకరించే బాక్సును పెట్టి మిన్నకుంటున్నారు. జిల్లాలో ఇలాంటి సైనిక సంక్షేమ కార్యక్రమం ఉందనే విషయం తెలియదనేవారు కోకొల్లలు.

గర్వించే స్టిక్కర్లు..

యువత తమ ద్విచక్ర, ఇతర వాహనాలపై ఆర్మీ అనే అక్షరాలు, సైనిక దళాలకు చెందిన అంశాలు పెట్టుకోవడంపై ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. నిబంధనల కారణంగా ఎక్కువమంది వీటి జోలికి వెళ్లడం లేదు. ఇప్పుడు యువత ముచ్చటపడే సైనిక స్టిక్కర్లను సైనిక సంక్షేమ శాఖ అందుబాటులోకి తెచ్చింది. చిన్నది రూ.2, వాహనానికి అతికించుకునేది అయితే రూ.40 చొప్పున అందుబాటులోకి తెచ్చారు. చిన్న డబ్బాలతో విరాళాల కోసం వచ్చే ఎన్‌సీసీ కేడెట్లకు ఇచ్చే విరాళమేదైనా సైనిక విభాగాలకు నేరుగా చేరుతుంది. ఎక్కువ మంది దాతలు స్పందిస్తే అంత ఎక్కువ సహకారం మన బలగాలకు చెందుతుందని సైనిక సంక్షేమ శాఖ చెబుతోంది.

ఏం చేస్తారంటే..

సైనికులకు 1948లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటుచేసింది. ఇందులో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి, ఆర్మీ, నావికా, వాయుసేన దళాల సైన్యాధ్యక్షులు ఉంటారు. రాష్ట్రస్థాయిలో సైనిక సంక్షేమ నిధికి అధ్యక్షుడిగా రాష్ట్ర గవర్నర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షుడిగా, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. వీరమరణం పొందిన సైనికులతో పాటు సమస్యల్లో ఉన్న వారి కుటుంబీకులకు, క్షతగాత్రులైన సైనికులకు అండగా ఉండేందుకు సాయధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌లో జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తారు.

ఉమ్మడి చిత్తూరు సమాచారం

వార్‌ విడోస్‌ 15

యుద్ధంలో గాయపడిన మాజీ సైనికులు 10

అన్ని కేటగిరీల మాజీ సైనికులు 11,000

సేవాదృక్పథంతో ఇవ్వాలి..

జిల్లాలోని ప్రతిఒక్కరూ సాయుధ దళాల పతాక నిధికి తమ వంతు విరాళాలు అందజేయాలి. దేశ రక్షణ కోసం ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటారు. సైనిక వ్యవస్థ ఎంతో గొప్పది. ప్రమాదవశాత్తు యుద్ధాల సమయంలో చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోతుంటారు. సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏటా సాయుధ దళాల దినోత్సవాన్ని పురస్కరించుకుని విరాళాలు సేకరిస్తారు.

– సుమిత్‌కుమార్‌ గాంధీ, కలెక్టర్‌, చిత్తూరు

అందరూ ముందుకు రావాలి

సాయుధదళాల పతాక నిధికి అందజేసే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. సైనికులు కన్న వారికి..ఉన్న ఊరికి దూరంగా ఉంటూ మాతృభూమి రక్షణకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తారు. వారి కోసం ప్రతి ఒక్కరూ తమవంతు విరాళాలు అందించాలి. మాజీ సైనికులు, వారి పిల్లల సంక్షేమానికి ఏర్పాటు చేసిన నిధికి విరాళాలు సేకరించే కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నాం.

– రాఘవులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా

సైనిక సంక్షేమ శాఖ అధికారి

విరాళానికి పన్ను మినహాయింపు..

పన్ను మినహాయింపు వర్తించే అంశాల్లో సైనిక సంక్షేమానికి ఇచ్చే విరాళాలకు ప్రముఖ స్థానం ఉంది. ఆదాయపు పన్ను విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు 80 జీ(5)(వీఐ) ఐటీ యాక్ట్‌ 1961 ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. 2025వ సంవత్సరం మార్చి వరకు విరాళాలు అందించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. విరాళాలు పంపేవారు జిల్లా సైనిక వెల్ఫేర్‌ ఆఫీసర్‌, చిత్తూరు, అకౌంట్‌ నంబర్‌ 62125384416, గిరింపేట బ్రాంచ్‌, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌007083కు పంపాలని అధికారులు కోరుతున్నారు. వివరాలకు 8688817824,08572–228682 నంబర్లలో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
సైనికుల సంక్షేమం.. 1
1/3

సైనికుల సంక్షేమం..

సైనికుల సంక్షేమం.. 2
2/3

సైనికుల సంక్షేమం..

సైనికుల సంక్షేమం.. 3
3/3

సైనికుల సంక్షేమం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement