‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’
రామకుప్పం: తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని వేరే విచారణ సంస్థ ద్వారా కేసు దర్యాప్తు చేయాలని రామకుప్పం మండలంలోని 89 పెద్దూరు సర్పంచ్ మల్లిక భర్త గోవిందప్ప మంగళవారం కర్నూలులో లోకాయుక్త సంస్థ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాలు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 89 పెద్దూరు పంచాయతీ సర్పంచ్‌గా మల్లిక గెలుపొందారని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత తన భార్యను సర్పంచ్ పదవికి రాజీనామా చేయాలని స్థానిక టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారన్నారు. అదేవిధంగా మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాలేదని, పంచాయతీలో ప్రజలకు అందుబాటులో లేదన్న కారణాలతో సర్పంచ్ మల్లిక చెక్ పవర్‌ను రద్దు చేశారన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో తప్పుడు ఫిర్యాదుతో అన్యాయంగా తనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి 35 రోజుల పాటు రిమాండ్‌లో ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై నమోదైన కేసును వేరే విచారణ సంస్థ ద్వారా విచారణ చేసి తనకు న్యాయం చేయాలని గోవిందప్ప కోరారు.
లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు
కార్వేటినగరం : కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లిలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ హనుమంతప్ప తెలిపిన వివరాల మేరకు.. గోపిశెట్టిపల్లె దళితవాడకు చెందిన యువకుడు ఓ బాలికను పల్లిపట్టులో సినిమాకు తీసుకెళ్తానని చెప్పి మార్గం మధ్యలో పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి పారిపోయాడు. బాలిక తేరుకుని ఊళ్లోకి వెళ్లి కుటుంబ సభ్యులకు జరిగిన అఘాయిత్యాన్ని తెలియజేసింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు సీఐ తెలిపారు.
సంక్షేమ వసతి గృహాల మరమ్మతులకు నిధులు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల లేక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సాక్షి దినపత్రికలో ఇటీవల వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కూటమి ప్రభుత్వం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు నిధులను మంజూరు చేసింది. చిత్తూరు జిల్లాలోని 48 వసతి గృహాల్లో వివిధ మరమ్మతులకు రూ.8.83 కోట్లు, తిరుపతి జిల్లాలో 55 వసతి గృహాలకు రూ.6.34 కోట్లను మంజూరు చేసింది. మంజూరైన నిధులను కలెక్టర్ అనుమతులతో మరమ్మతులు చేపట్టనున్నారు. ప్రధానంగా రెండు జిల్లాల్లోని వసతి గృహాల్లో తాగునీటి సరఫరా, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, తలుపులు, కిటికీలకు మెష్‌లు, పైకప్పులు, ఫ్లోరింగ్, ప్రహరీగోడ పనులు, మరుగుదొడ్లు తదితర మరమ్మతులకు నిధులను వినియోగించనున్నారు.
నేటి నుంచి ఎస్‌ఏ టర్మ్–1 పరీక్షలు
● జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ పరశురామనాయుడు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఎస్‌ఏ టర్మ్–1 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ పరశురామనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 11 నుంచి 19వ తేదీ వరకు సెల్ఫ్ అసెస్‌మెంట్ టర్మ్–1 (ఎస్‌ఏ టర్మ్–1) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలను ఎస్సీఈఆర్టీ నుంచి పంపిణీ చేశారన్నారు. అయితే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఎస్సీఈఆర్టీ లేదా ఆయా యాజమాన్యాల సొంత ప్రశ్నపత్రాలతో పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించిందన్నారు. 1 నుంచి 5 వ తరగతి వరకు 11న తెలుగు, ఉర్దూ, 12న ఇంగ్లిష్, 13న గణితం, 16న ఈవీఎస్ పరీక్షలు, అలాగే 6 నుంచి 10వ తరగతి వరకు 11న తెలుగు, ఉర్దూ, 12 న హిందీ, 13న ఇంగ్లిష్, 16న గణితం, 17న భౌతికశాస్త్రం, 18న జీవశాస్త్రం, 19న సాంఘికశాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రశ్నపత్రాలను ఎంఈఓ కార్యాలయాల నుంచి సంబంధిత షెడ్యూల్ ప్రకారం ఏ రోజుకారోజు గంట ముందుగా హెచ్‌ఎంలు తీసుకెళ్లాలని ఆదేశించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈ నెల 22 వ తేదీ లోపు హొలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేసి తల్లిదండ్రులకు పంపాలని, అలాగే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment