గోకులం షెడ్ల నిర్మాణంలో అలసత్వం వద్దు
● ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టండి ● ఆర్‌సీహెచ్‌ఎస్ పోర్టల్ నమోదులో ఎందుకు అలసత్వం ? ● పలు శాఖల అధికారులతో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ వరుస సమీక్షలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో చేపడుతున్న గోకులం షెడ్ల నిర్మాణంలో అలసత్వం వహిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాడి రైతుల అభివృద్ధికి చేపడుతున్న గోకులం షెడ్ల నిర్మాణంలో ఇచ్చిన లక్ష్యాల మేరకు మండలాల్లో పురోగతి సాధించాలన్నారు. పాడి పశువుల పెంపకానికి గోకులం షెడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందన్నారు. మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టని వారు వారం రోజుల్లో పనులు మొదలు పెట్టేలా చర్యలు చేపట్టాలని, వాటిని రద్దు చేసి మరొకరికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. షెడ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పూర్తయిన పనులకు తప్పనిసరిగా ఎంబుక్ రికార్డు చేయాలని సూచించారు. గోకులం షెడ్ల నిర్మాణానికి నిధుల సమస్య లేదన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో పాడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండల స్థాయిలో పశుసంవర్థక శాఖ అధికారుల పూర్తి భాగస్వామ్యంతో నిర్మాణాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ రవికుమార్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ప్రభాకర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
వైద్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడాలి
వైద్యశాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణిని వీడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ హెచ్చరించారు. ఆర్‌సీహెచ్‌ఎస్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ సర్వే) పోర్టల్‌లో తల్లి, పిల్లల రిజిస్ట్రేషన్ తక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎన్‌ఎం, ఆశాల సేవలను వినియోగించుకుని డేటాను వెంటనే అప్‌లోడ్ చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగితే సంబంధిత మహిళలకు ఇచ్చే ప్రోత్సాహకాలను సకాలంలో ఖాతాలకు జమచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కాన్పులు తక్కువగా జరుగుతున్న పీహెచ్‌సీల తీరుపై మండిపడ్డారు. పుట్టిన పిల్లలకు ఇవ్వాల్సిన వ్యాధి నిరోధక టీకాలను నూరు శాతం అందజేయాలన్నారు. హైరిస్కు గర్భిణులను గుర్తించి ప్రత్యేక చికిత్స అందించాలన్నారు. మొదటి కాన్పులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద రూ.6 వేలు అందజేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణుల చికిత్సకు అవసరమైన అదనపు నిధులను ఖర్చు చేయవచ్చని ఆదేశించారు. సమీక్షలో డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభావతిదేవి, డీసీహెచ్‌ఎస్ ప్రభావతి తదితర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment