బడికి ఆలస్యంగా వస్తే వేటు
● ఆకస్మిక తనిఖీల్లో కొంతమంది టీచర్లు ఆలస్యంగా వస్తున్నట్లు గుర్తించాం ● ‘పది’ విద్యార్థుల ఉత్తీర్ణత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం ● విలేకరులతో డీఈఓ వరలక్ష్మి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా ఇటీవల తాను పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు కొంతమంది టీచర్లు ఆలస్యంగా హాజరవుతున్న విషయాన్ని గుర్తించామని, వారికి మొదటిసారి హెచ్చరిక ఇచ్చి వదిలేశామని డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం ఆమె డీఈఓ కార్యాలయంలో విలేకరులతో పలు అంశాలను వెల్లడించారు. ఆలస్యంగా వస్తున్న టీచర్లు ఇదే పద్ధతిని కొనసాగిస్తే సస్పెండ్ చేయడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే ముఖ్య ఆశయమన్నారు. పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సమ్మేటివ్–1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రాథమిక స్కూల్లో 52,429 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 10,293 మంది, హైస్కూళ్లలో 85,668 మంది పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు.
జిల్లాలో 311 మంది టీచర్ల సర్దుబాటు..
జిల్లావ్యాప్తంగా నిబంధనల మేరకు 32 మండలాల్లో 311 మంది టీచర్లను కొరత ఉన్న స్కూళ్లకు సర్దుబాటు చేసినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలోని ఏ మండలంలోనూ టీచర్ల కొరత లేకుండా కసరత్తు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ కమిటీ సమావేశాల నివేదికలను సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2,462 స్కూళ్ల నుంచి సేకరించే నివేదికలను ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ప్రాథమిక విద్యార్థుల్లో సామర్థ్యాలు తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని శుభ్రత నడుమ వండి విద్యార్థులకు పెట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment