మూడుముళ్లు.. బాల్యానికి సంకెళ్లు | - | Sakshi
Sakshi News home page

మూడుముళ్లు.. బాల్యానికి సంకెళ్లు

Published Wed, Dec 11 2024 12:39 AM | Last Updated on Wed, Dec 11 2024 6:08 PM

బాధ్యత తీరిపోవాలి అంటూ చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు

బాధ్యత తీరిపోవాలి అంటూ చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్న తల్లిదండ్రులు

జిల్లాలో జోరుగా బాల్య వివాహాలు

చెదిరిపోతున్న ఆడపిల్ల స్వప్నం

చేజేతులా బంగారు భవిష్యత్‌ నాశనం

చిన్న వయసులోనే గర్భం దాల్చి అష్టకష్టాలు

మాతాశిశుమరణాలకు ప్రధానం కారణాలు కూడా ఇవే

ఏటా పెరుగుతున్న బాల్య వివాహాల సంఖ్య

అడ్డుకట్టకు కిశోర వికాసం కార్యక్రమం

పుస్తకాలు పట్టాల్సిన చిట్టి తల్లులు బాల్యంలోనే పెళ్లి పీటలెక్కుతున్నారు. అన్నెంపున్నెం ఎరుగని ఆ పుత్తడి బొమ్మల మెడలో పుస్తెలతాడు ఉరితాడులా మారి ఉచ్చు బిగుస్తోంది. తెలిసీ తెలియని వయసులో పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని ఆ పసిపాపలపై సంసార బాధ్యతలు గుదిబండలా మారుతున్నాయి. పేదరికం ఒక వైపు, ఆడపిల్ల భారం తీరుతుందని కన్నోళ్లే సంసారం అనే సాగరంలోకి నెట్టేస్తున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు, పేద కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చి అనారోగ్యం బారిన పడి జీవితాలు మగ్గిపోతున్నాయి.

మేలిమి బంగరు మెలతల్లారా.. కలువల కన్నుల కన్నెల్లారా.. తల్లులగన్నా పిల్లల్లారా.. విన్నారమ్మా ఈ కథను.. అంటూ గురజాడ అప్పారావు బాల్యవివాహపు ఉక్కుకోరల్లో చిక్కుకుని బలైపోయిన బాలిక గురించి రాసిన దీనగాథే పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ. పాషాణ కఠిన కర్కశ హదయాన్నైనా కరిగించి పారేస్తుంది ఈ కథనం.

చిత్తూరు రూరల్‌(కాణిపాకం) : పేదరికం, నిరక్షరాస్యత, కట్టుబాట్లు, సామాజిక రుగ్మతలతో ఆడ పిల్లలను భారంగా భావిస్తున్న కొందరు తల్లిదండ్రులు త్వరగా పెళ్లిళ్లు చేయడానికి మొగ్గు చూపుతుండడంతో చిన్నారుల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. బాల్య వివాహాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పించినా.. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. ప్రజల్లో పూర్తిస్థాయిలో మార్పు రావడం లేదు. కట్టుబాట్లనే చాదస్తం వల్ల తల్లిదండ్రులు చేసే అనాలోచిత చర్యల వల్ల చిన్నారుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో బాల్యవివాహాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో ఈ ఏడాది మాతా శిశు సంక్షేమ అధికారులు 72 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. అయినా పలుచోట్ల మాత్రం ఇవి ఆగడం లేదు. అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రులకు, బాలికకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు బాల్య వివాహాలు తగ్గినట్టు కనిపిస్తున్నా, అయినా లోలోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. కుప్పం, రామకుప్పం, బైరెడ్డిపల్లి, పలమనేరు, వీ.కోట, బంగారుపాళ్యం, నగరి, చిత్తూరు, గుడిపాల తదితర ప్రాంతాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ముహూర్తాల సమయంలోనే గుళ్లు గోపురాలు, ఇళ్ల వద్దే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరిగిపోతున్నాయని అధికారులు అంటున్నారు.

బాల్య వివాహం నేరం..

బాల్య వివాహాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు ఉన్నా అవి చట్టబండలుగానే మిగిలిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. బాల్య వివాహం చట్టరీత్యా నేరం. పెళ్లి చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుంది. సమాచారం అందిస్తే సంబంధిత అధికారులు ఆ వివాహాన్ని అడ్డుకుని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో పాటు 18 ఏళ్లు నిండే వరకు బాలికకు వివాహం చేయబోమని ఒప్పంద పత్రం రాయించుకుంటారు.

గర్భిణుల వివరాలు..

సంవత్సరం; గర్భిణులు; చిన్నవయసులో గర్భిణులు

2021–22; 33618; 286

2022–23; 32051; 433

2023–24; 32571; 1014

2024–24; 21949; 982

బాల్య వివాహాల సంఖ్య..

సంవత్సరం; సంఖ్య

2021; 34

2022; 13

2023; 70

2024; 72

రిస్క్‌లో పడతారు..

బాల్య వివాహాలు చేయడంతో గర్భం దాల్చిన బాలికలు ఎనీమియా బారిన పడే ప్రమాదం ఉంది. ప్రసవం సమయంలో అధిక రక్తస్రావం, అధిక రక్త పోటుతో ప్రసూతి మరణాలు జరుగుతాయి. బిడ్డను మోసే సామర్థ్యం బాలికలకు తక్కువగా ఉంటుంది. చిన్నవయసులో ప్రెగ్నెన్సీ వల్ల బిడ్డతో పాటు తల్లి ప్రాణానికి కూడా ప్రమాదమే. టీనేజీ ప్రెగెన్సీ రిస్క్‌తో కూడుకున్నది. అమ్మాయిలకు 21 ఏళ్లలో ప్రసవం మంచింది. – ప్రభావతి దేవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు 

బాల్య వివాహాలను అడ్డుకోవడమే లక్ష్యం

బాల్య వివాహాలను అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తున్నాం. మా బృందాలతో నిజనిజాలను పరిశీలించి వెంటనే ఆ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నాం. బాల్య వివాహాలను ప్రోత్సహించే వ్యక్తులపై కేసులు పెట్టేలా చట్టాలు ఉన్నాయి. సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంటాయి. 

– నాగమణి, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, జిల్లా కోఆర్డినేటర్‌, చిత్తూరు

అడ్డుకట్ట ఇలా..

బాల్య వివాహాలను అడ్డుకునే బాధ్యత గతంలో స్వచ్ఛంద సంస్థ చేతిలో ఉండేది. ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 1098 ట్రోల్‌ ఫ్రీ నంబరును అమలు చేసింది. జిల్లాస్థాయిలో చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. విజయవాడకు అనుసంధానమైన ఈ సెంటర్‌.. జిల్లాలో జరిగే బాల్య వివాహాల ఫిర్యాదును జిల్లా సెంటర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ.. అడ్డుకట్ట వేస్తోంది. వీటి నిర్వహణకు జిల్లా కోఆర్టినేటర్‌, హెల్ప్‌ డెస్క్‌లో సూపర్‌వైజర్‌, ఒక కౌన్సిలర్‌, ముగ్గురు సూపర్‌ వైజర్లు, ముగ్గురు కేసు వర్కర్లు పనిచేస్తున్నారు. వీరు వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలోని అంగన్‌వాడీ, వైద్య సిబ్బంది, పోలీసులు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేసి బాల్య వివాహాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చిన్నతనంలోనే తల్లిగా..

చిన్న తనంలోనే పెళ్లి చేయడం వల్ల బిడ్డకు తల్లై.. శారీరక సమస్యల బారిన పడుతున్నారు. దీంతో పాటు మాతృమరణాలు, శిశు మరణాలు సంభవిస్తున్నాయి. నెలలు నిండకనే బిడ్డ పుట్టడం, బరువు తక్కువగా పుట్టడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, శారీరక లోపాలు.. ఇతరత్రా కారణాలు ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే చిట్టి తల్లులు చాలామందికి సుఖ ప్రసవం కాక సిజేరియన్‌ వైపు మొగ్గు చూపాల్సి వస్తోంది. దీంతో వారు చివరి వరకు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement