మేళాలో 22 మందికి ఉద్యోగాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో సీడప్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ శాఖలు సంయుక్తంగా ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగ మేళాలో 4 బహుళజాతి కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 57 మంది నిరుద్యోగులు మేళాలో పాల్గొనగా 22 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ, అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏకాంబరం, ఐటీఐ ప్లేస్‌మెంట్ అధికారి మురళీకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.
కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్
– ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా జేసీ విద్యాధరి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ మంగళవారం బయలుదేరి వెళ్లారు. కాన్ఫరెన్స్‌కు అవసరమైన అజెండా అంశాల సమాచారాన్ని జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సేకరించి కలెక్టర్‌కు నివేదించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం సెషన్‌లో గ్రీవెన్స్, ఆర్‌టీజీఎస్, వాట్సాప్ గవర్నెన్స్, జీఎస్‌డబ్ల్యూఎస్‌లు, మధ్యాహ్నం సెషన్‌లో వ్యవసాయం, పశుసంవర్థక, ఉద్యాన, పౌరసరఫరాలు, అటవీ, నీటిపారుదల, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్, ఉపాధి హామీ, గ్రామీణ తాగునీరు, సెర్ఫ్, మున్సిపల్, శాంతిభద్రతలు అనే అంశాలపై సీఎం చంద్రబాబునాయుడు సమీక్షించనున్నారు. 12వ తేదీ ఉదయం సెషన్‌లో పరిశ్రమలు, ఐటీ, ఐటీఈ అండ్‌సీ, ఐఅండ్‌ఐ, విద్యుత్, మానవవనరుల అభివృద్ధి, రహదారులు, గృహనిర్మాణం, సోషల్‌వెల్ఫేర్, బీసీ, మైనార్టీ సంక్షేమం, ఐసీడీఎస్, రెవెన్యూ (భూములు, రిజిస్ట్రేషన్, స్టాంపులు) ఎకై ్సజ్, గనుల శాఖలపై చర్చ నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అభివృద్ధి ప్రణాళికల అంశంపై కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా జేసీ విద్యాధరి వ్యవహరించనున్నారు. 13వ తేదీ నుంచి కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
వ్యాధుల నివారణకు
తక్షణ చర్యలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఇటీవల కురిసిన వర్షాలకు డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాపిస్తున్నాయని, వాటి నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి అనిల్ ఆదేశించారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆయన సబ్ యూనిట్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అక్కడక్కడ డెంగీ కేసులు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తక్షణం స్పందించి దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment