ఎస్‌ఎస్‌జే షుగర్స్‌కు మండలాల కేటాయింపు
నగరి : నేతమ్స్ షుగర్స్ పరిధిలో ఇదివరకు చెరుకు సాగుచేస్తున్న మండలాలను ఆంధ్రప్రదేశ్ కేన్ కమిషనర్ అమరావతి వారు నెలవాయిలోని ఎస్‌ఎస్‌జే షుగర్స్‌కు కేటాయించినట్లు చిత్తూరు డిప్యూటీ కేన్ కమిషనర్ జాన్ విక్టర్ తెలిపారు. మంగళవారం నగరి డివిజన్ చెరుకు రైతుల సమావేశంలో ఆయన ఈ మేరకు వివరాలను తెలియజేశారు. గత 5 ఏళ్లుగా నిండ్ర మండలంలోని నేతమ్స్ షుగర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మూతబడి ఉన్నందున స్థానికుల వినతి మేరకు దీని పరిధిలో చెరుకు సాగు మండలాలైన పుత్తూరు, నారాయణవనం, నిండ్ర, నాగలాపురం, కేవీబీ పురం, విజయపురం, నగరి, పిచ్చాటూరు మండలాలను నెలవాయిలోని ఎస్‌ఎస్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వారికి తాత్కాలికంగా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రాంత చెరుకు రైతులు ఈ విషయాన్ని గమనించాలని, ఇతర రాష్ట్రాలకు చెరుకు సరఫరా చేసి నష్టపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇకపై ఎస్‌ఎస్‌జే షుగర్స్‌లోనే ఒకవరుస క్రమంలో కటింగ్ పర్మిట్లు పొంది చెరుకు సరఫరా చేసుకోవచ్చన్నారు. ఫ్యాక్టరీ వారు కూడా అక్కడి రైతులకు అందించే అన్ని సౌకర్యాలను, సౌలభ్యాలు ఈ మండలాల రైతులకు కూడా అందుతాయని తెలిపారు. చెరుకు పేమెంట్ల విషయంలో కూడా రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌కు కూడా సూచించామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌జే షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ సి.రాధాకృష్ణన్, అడ్వైజర్ కేన్ ఎం.కృష్ణన్, ఏజీఎం కేన్ కె.వరదరాజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment