లక్ష్య సాధనలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయిలో పథకాల లక్ష్యసాధనలో అలసత్వం వహించకూడదని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశమందిరంలో డీఆర్‌డీఏ, వెలుగు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్దేశించిన పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలన్న సంకల్పంతో డీఆర్‌డీఏ అనేక పథకాలను చేపడుతోందన్నారు. ఈ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లి గ్రామీణ పేదలకు చేరువచేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో ఇప్పటికే గ్రామాల్లో పేద మహిళల్లో ఆర్థిక స్వావలంబన చేకూరిందన్నారు. స్వయం సహాయ సంఘాల్లో సంఘానికి ఒకరినైనా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే డీఆర్‌డీఏ ముఖ్య ఆశయమన్నారు. సంఘాల్లో అర్హత కలిగిన మహిళలను చైతన్యవంతులు చేయాలని, తద్వారా సమాజం ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని చెప్పారు. స్వయం సహాయక సంఘాలు సాంకేతికను అందిపుచ్చుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆన్‌లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీఏ ఏపిడి రవికుమార్, డీపీఎంలు వెంకటేష్, రవి, ఏపీఎం సుబ్బారెడ్డి, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment