తిరుపతి సిటీ: ఎస్వీయూలోని డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వర్సిటీ అధికారుల బృందం న్యూఢిల్లీ వెళ్లి డీడీఈలో నిలిచిపోయిన అడ్మిషన్లను పునరుద్ధరించాలని యూజీసీకి విన్నవించారు. ఈ నేపథ్యంలో జనవరి మొదట వారంలో యూజీసీ కమిటీ వర్సిటీలో పర్యటించి, డీడీఈ అడ్మిషన్ల ప్రకియను కొనసాగించేందుకు ఉన్న అర్హతలు, సదుపాయాలను పరిశీలించి అనుమతులు ఇవ్వనుంది. దీంతో వచ్చే ఏడాది నుంచి యూజీ, పీజీ, డిప్లొమో కోర్సులకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. దీంతో కొంత కాలంగా దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ చేసేందుకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు కాస్త ఊరట కలిగించనుంది.
వచ్చే నెల 18 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్వీయూ డీడీఈ పరిధిలో 2021–22లో అడ్మిషన్లు పొందిన యూజీ, పీజీ, డిప్లొమో కోర్సుల విద్యార్థులకు వచ్చే నెల 18వ తేదీ నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని కోర్సుల పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఈ పరీక్షలు, యూజీసీ కమిటీ పర్యటన నేపథ్యంలో వర్సిటీ అధికారులు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment