● 20 రోజుల తరువాత వెలుగులోకి ఘటన ● కన్నతండ్రిపై అనుమానాలు ● త్వరలోనే వాస్తవాలు తేలుస్తాం: సీఐ శ్రీనివాసులు
పుంగనూరు: ఓ యువకున్ని 20 రోజుల కిందట పుంగనూరు మండల పరిధిలో రాళ్లతో కొట్టి చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం పుంగనూరు సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలిలా.. 20 రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోయకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేసి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి దీన్ని గమనించిన ఆ ప్రాంత వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. హతుడి వద్ద దొరికిన సమాచారం ఆధారంగా మదనపల్లె రూరల్ మండలం మమ్మిడిగుండ్లపల్లెకి చెందిన గంగుల రెడ్డి కుమారుడు సోమశేఖర్రెడ్డిగా నిర్ధారించారు. శవం పూర్తిగా గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో అక్కడే పోస్టుమార్టం చేశారు. ఈ మేరకు దర్యాప్తులో హత్యగా నిర్ధారించారు. దీనిపై సీఐ మాట్లాడుతూ యువకుడి హత్యకేసులో పలురకాల అనుమానాలు ఉన్నాయని, హతుడి తండ్రిపై కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉందని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా సోమశేఖర్రెడ్డిపై భార్యాబిడ్డలు మృతి చెందిన కేసులో మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి ఉన్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment