ఘనంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల
● జిల్లావ్యాప్తంగా స్ఫూర్తి నింపేలా సేవా కార్యక్రమాలు ● మిన్నంటిన జై జగన్ నినాదం ● గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనను గుర్తు చేసుకున్న జనం ● ఆర్నెళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మార్పు
చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
చిత్తూరులో ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింతలకు పండ్లు పంపీణీ చేస్తున్న విజయానందరెడ్డి
● గంగాధరనెల్లూరు నియోజకవర్గం కేంద్రంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కృపాలక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నారు. నాయకులు, కార్యకర్తలకు తాను అండగా ఉంటానని తెలిపారు. గంగాధర నెల్లూరులో ఎంపీపీ అనిత రెడ్డి ఆధ్వర్యంలో 40 కేజీల భారీ కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. అలాగే శ్రీరంగరాజపురంలో వైఎస్సార్, అంబేడ్కర్ అంబేడ్కర్ విగ్రహాలకు, పాలసముద్రంలో వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
● పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట(ఓగు పంచాయతీ)లో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, వి.కోటలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలనను జగనన్న మాత్రమే అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలోని నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
● పుంగనూరులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ ఈవీఎంల గోల్‌మాల్‌తో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదని విమర్శించారు. ఎల్లప్పుడూ ప్రతిపక్షాన్ని వేధించడం పనిగా పెట్టుకున్నారని తెలిపారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ఆరు నెలల్లోనే కూటమి పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, సీమ జిల్లా మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్దీన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
● పూతలపట్టులో మాజీ ఎమ్మెల్యే సునీల్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీపై ప్రజల ఆదరణ ఏ మాత్రం తగ్గలేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన జగనన్న పాలనను ప్రజలు మరిచిపోలేదని చెప్పారు. యాదమరిలో జెడ్పీ వైస్ ఛైర్మన్ ధనంజయరెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి నేతలు ఇన్నాళ్లూ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే భయపడ్డారు.. ఇప్పుడు వైఎస్ జగన్ కటౌట్‌ని చూసినా భయపడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే.రోజా ఎద్దేవా చేశారు. అధికారులను అడ్డం పెట్టుకుని పుట్టిన రోజు వేడుకలను అడ్డుకుంటున్నారన్నారు. తిరుపతిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆమె కూటమి నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆస్తులు ధ్వంసం చేసినా.. వేధింపులకు గురిచేసినా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. కూటమి నేతలు ఓట్ల కోసం.. కాళ్లు, చేతులు పట్టుకున్నా ఫలితం ఉండదని గ్రహించి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలిచారని విమర్శించారు. అధికార పార్టీపై నెల రోజులుకే వ్యతిరేకత మొదలైందన్నారు. జగనన్న నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేద్దామని నాయకులకు పిలుపునిచ్చారు. తాను అవినీతికి పాల్పడ్డానని చెబుతున్న వారికి ఆమె సవాల్ విసిరారు. తాను అవినీతికి పాల్పడి ఉంటే.. ఇప్పుడు అధికారం మీ చేతుల్లోనే ఉందని.. తాను చేసిన తప్పు ఏంటో నిరూపించాలని డిమాండ్ చేశారు. అబద్ధపు హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. తిరుపతిలో పబ్‌లు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు.
చిత్తూరులో నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. గిరింపేటలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ కేక్ కట్ చేశారు. కట్టమంచిలో మహిళలు కోలాట ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులు, బాలింతలకు పండ్లు పంచిపెట్టారు. ఆయన మాట్లాడుతూ కుప్పంలో జగనన్న జన్మదినం రోజున ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. కూటమి నాయకుల కక్షసాధింపు ధోరణికి ప్రజలు గుణపాఠం ప్రజలు చెబుతారన్నారు. గుడిపాల, రూరల్ మండలాల్లో నాయకుల ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి అన్నదానం చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ తర్వాత ప్రజలకు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్పనేత జగనన్న అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment