నిరసన ర్యాలీ రేపు
మాజీమంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో నిరసనకు
పోలీసులను అనుమతి కోరిన మాజీ ఎంపీ
పుంగనూరు: వైఎస్సార్ సీపీ అధిష్టానం పిలు పు మేరకు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈనెల 27వ తేదీన పుంగనూరులో మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ రెడ్డెప్ప తెలిపారు. బుధవారం సీమ జిల్లాల మైనార్టీసెల్ ఇన్‌చార్జ్ ఫకృద్దీన్ షరీఫ్‌తో కలసి రెడ్డెప్ప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ శ్రీనివాసులుకు అనుమతి మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డెప్ప మాట్లాడుతూ పార్టీ పిలుపు మేరకు ఉదయం 10 గంటలకు బస్టాండ్‌కు ప్రతి ఒక్కరూ చేరుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, అక్కడి నుంచి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ కోర్టు రోడ్డులోని ఏపీఎస్‌పీడీసీఎల్ కా ర్యాలయం వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, నిరసన ర్యాలీని జయప్రదం చేయాలన్నారు.
కాణిపాకంలో భక్తుల రద్దీ
కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. దీంతో ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శన క్యూలు కిటకిటలాడాయి. దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు.
రేపు జాబ్‌మేళా
పలమనేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 27వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు ఆ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర నై పుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్ఛ్సేంజ్, సీడాప్, డీఆర్‌డీఏల సంయుక్త ఆధ్వర్యంలో మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. మేళాలో టాటా క్యాపిటల్, మెడ్‌ప్లస్, సుగుణ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయి ఉండి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. వివరాల కో సం 8465830771, 9963561755 నంబర్లలో సంప్రదించాలన్నారు.
తత్కాల్ ఫీజుతో అడ్మిషన్లకు అవకాశం
● పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఓపెన్ స్కూల్‌లో తత్కాల్ ఫీజుతో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించారని జిల్లా పరీక్షల విభాగం కా ర్యదర్శి వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీలో నిర్వహించే పది, ఇంటర్ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులకు ఇదొక సదావకాశమన్నారు. పది, ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే వారు ఈ నెల 26 నుంచి 31వ తేదీ లోపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అడ్మిషన్ ఫీజునకు అదనంగా తత్కాల్ ఫీజు రూ.600 చెల్లించి అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు డీఈఓ కార్యాలయంలోని ఏపీ ఓపెన్ స్కూల్ విభాగంలో సంప్రదించాలని ఆయన కోరారు.
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 67,209 మంది స్వామివారిని దర్శించుకోగా 22,708 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.15 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment