దోపిడీకి గేటు
● ఇది చిత్తూరు నగరంలో రోడ్డుపై కొబ్బరిబోండాలు విక్రయించుకుంటూ జీవితం నెట్టుకొస్తున్న ఓ పేదవాడు చెల్లించిన గేటు రుసుముకు సంబంధించిన రశీదు. డిసెంబర్‌లో రోజుకు రూ.20 వసూలు చేస్తే, ఈనెల 1వ తేదీ నుంచి రూ.50 గుంజుకుంటున్నారు. గుడిపాలకు చెందిన ఈ వ్యక్తి ఒక్కో కొబ్బరికాయను రూ.12లకు కొనుగోలు చేసి, దాన్ని రూ.20లకు అమ్ముకునేందుకు రోజంతా ఎండలో నిలబడాలి. బస్సు చార్జీలు, రెండు పూటల తిండి అన్నీ ఇందులోనే చూసుకోవాలి. సాయంత్రానికి జేబులో రూ.300 మిగిలాయి అనుకుంటే, గేటు పేరిట రూ.50 లాక్కుంటున్నారు.
● ‘‘చిత్తూరు పాత బస్టాండులో బస్సులు పార్కింగ్ చేసుకునేందుకు వసతి ఉందా..? ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఉన్నాయా..? గత పదేళ్లుగా ఒక్క రూపాయి కూడా గేటు కట్టలేదు. ఇప్పుడు వచ్చి ఏకంగా ఒక్కో బస్సుకు రోజుకు రూ.300 అడుగుతున్నారు. అంటే 72 బస్సులకు నెలకు రూ.6.48 లక్షలా..? ఇంత మొత్తం ఆదా యం వస్తుంటే, కార్పొరేషన్ వాళ్లు మూడు నెలలకు రూ.1.88 లక్షల చొప్పున ఎందుకు అప్పగించారు..? మేము పైసా కూడా గేటు రుసుము కట్టం. ముందు బస్టాండులో సౌకర్యాలు కల్పించాలి. గెజిట్‌లో గేటు ఫిక్స్ చేసేటప్పుడు మా అభ్యంతరాలు తీసుకోవాలి. మేము కూడా రూలింగ్(టీడీపీ) పార్టీ లో కీలక పదవుల్లో ఉన్నాం..’’
– శనివారం నగర పాలక సంస్థ కమిషనర్‌తో ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల భేటీలోని సారాంశం
● రైతుల రక్తం పీల్చేస్తున్న కూటమి నేతలు ● తోపుడు బండి వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లు
● ఎదురు తిరిగిన ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ● ప్రజాప్రతినిధులు స్పందించాలంటూ డిమాండ్లు
చిత్తూరు అర్బన్: జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కొలువై ఉంటారు. అయితే నగరంలోని అక్రమాలను ఒక్కరూ పట్టించుకోవడం లేదు. కూటమి నేతలు ‘గేటు’ పేరుతో సామాన్యుడిని యథేచ్ఛగా దోచుకుంటున్నా.. నడిరోడ్డుపై దౌర్జన్యాలకు దిగుతున్నా ప్రశ్నించేవారే కనిపించడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చిన రైతుల రక్తాన్ని పీల్చేస్తున్నా.. స్పందించే నాథుడే కరువయ్యాడు. ప్రధానంగా జిల్లాలోని 20 మండలాలతోపాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు చెందిన రైతులు కూరగాయలను చిత్తూరులోని హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో ఈ రైతులతోపాటు నగరంలోని రోడ్లపై వ్యాపారాలు చేసుకునేవాళ్ల నుంచి కార్పొరేషన్ గేటు పేరిట కొద్ది మొత్తంలో రుసుము వసూలు చేయొచ్చని గెజిట్‌లో రూపొందించారు. అయితే ఎవరు గేటు చెల్లించాలి..? ఎంత చెల్లించాలి..? ఎవరికి మినహాయింపు ఉంది..? అనే విషయాలు కార్పొరేషన్ యంత్రాంగం ఎక్కడా ప్రకటించలేదు. కనీసం బహిరంగ ప్రదేశాల్లో బోర్డు సైతం ఏర్పాటు చేయలేదు. పైగా అధికారుల వద్ద ఉన్న గెజిట్‌లో రుసుముల వసూళ్లు మొత్తం తప్పులతో నిండిపోయింది. గేటు వసూలులో వచ్చిన విభేదాలే గతంలో అప్పటి మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యకు కారణమనే విషయం చిత్తూరులో అందరికీ తెలిసిన సత్యం. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విజయానందరెడ్డి తన సొంత డబ్బులను కార్పొరేషన్‌కు చెల్లించేవారు. దీంతో ప్రజలపై ఒక్క రూపాయి కూడా గేటు భారం పడేది కాదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్కెట్ గేటును తమ కార్యకర్తల చేతుల్లో పెట్టింది. దీంతో వారు ఇష్టారాజ్యంగా సామాన్యులను దోచుకుంటున్నారు. ఈ వ్యవహారం మరికొందరిని బలి కోరకముందే ప్రజా ప్రతినిధులు మేల్కొని, మార్కెట్ గేటు వసూలుపై నియంత్రణ పెట్టాల్సిన అవసరముంది . చిత్తూరు నగర అభివృద్ధికి, ప్రజల ప్రశాంత జీవనానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పదే పదే చెబుతున్న ఎమ్మెల్యే జగన్‌మోహన్ సైతం దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment