ఊతమిస్తేనే.. ఊపిరొచ్చేది!
కన్నీటిని మింగుతున్న కరువుజీవులం..కష్టాలను ఓర్చుకుంటున్న కర్షకులం..పసిడి నేలలున్నా పట్టెడన్నం కరువుతో అల్లాడుతున్నాం.. పథకాలందని బడుగుజీవులం.. కాయకష్టంతో కొండలనే కరిగిస్తాం.. కన్నీళ్లను తుడిచే దారులు వెతుకుతున్నాం.. మేమే చిత్తూరు జిల్లా వాసులం.. నేడు జిల్లాకు వస్తున్న కరువు నిర్ధారణ బృందం నిర్ణయంపైనే మాకు ఊరట సాధ్యం. వారు ఊతమిస్తేనే.. మాకు ఊపిరి వస్తుందని ఆశిస్తున్నాం.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్‌లో రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంట ఎండిపోయింది. పెట్టుబడి కూడా చేతికి చిక్కకుండా పోయింది. ఫలితంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 16 మండలాల్లోని 24,342 మంది రైతులు సుమారు 9 వేల హెక్టార్లల్లో సాగు చేసిన పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకుగాను రూ.15.42 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో జిల్లాలో అత్యంత కరువు మండలాలుగా మూడింటిని ఎంపిక చేశారు. మరో 13 మండలాలు మధ్యస్థ కరువు మండలంగా గుర్తించారు. ఈ కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు బుధవారం కేంద్ర కరువు నిర్ధారణ బృందం యాదమరి మండలంలో పర్యటించనుంది.
ఖరీఫ్‌లో 13,044 హెక్టార్ల సాగు
జిల్లాలో ప్రధాన పంట వేరుశనగ. ఈ పంట వర్షాధారంగా సాగవుతోంది. జిల్లాలో సాధారణ విస్తీర్ణం 43,174 హెక్టార్లు కాగా 13,044 హెక్టార్లల్లో పంట సాగైంది. ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను కూడా పంపిణీ చేసింది. తొలకరి చినుకులు కూడా రైతులను కాస్త ఊరించాయి. దీంతో రైతులు విత్తనం విత్తారు. ఆ తరువాత వరుణుడి జాడ కరువైంది. ఊడలు, కాయలు బలపడే సమయంలో చినుకుజాడ లేకుండాపోయింది. దీంతో రైతు చేతికి తీగలు కూడా దక్కలేదు. పంట దిగుబడి 5 వేల నుంచి 6 వేల మెట్రిక్ టన్నులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పెరిగిన పెట్టుబడికి... చేతికి వచ్చిన దిగుబడికి పొంతన లేకుండా పోయింది. దీంతో రైతులు ఆర్థికంగా నష్టాలను చవి చూడాల్సి వచ్చింది.
ప్రభుత్వానికి కరువు నివేదికలు
వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన వేరుశనగ పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపారు. గుడిపాల, యాదమరి, పెనుమూరు మండలాల్లో తీవ్ర కరువుగా గుర్తించారు. అలాగే మరో 13 మండలాలు మధ్యస్థ కరువు మండలంగా గుర్తించి, వివరాలు అందజేశారు. సుమారు 9 వేల హెక్టార్లలో వేరుశనగ పంట నష్టం జరిగినట్లు వివరించారు.
జిల్లా వ్యాప్తంగా వేరుశనగపంట నష్టం
కన్నీళ్లు మిగిల్చిన ఖరీఫ్
అత్యంత కరువు మండలాలుగా
యాదమరి, పెనుమూరు, గుడిపాల
మధ్యస్థ కరువు మండలాలుగా 13
సుమారు 9 వేల హెక్టార్లల్లో నష్టం
నేడు యాదమరి మండలానికి
కరువు బృందం రాక
నేడు బృందం రాక
పంట నష్టం అంచనా వేయడానికి కేంద్ర కరువు నిర్ధారణ బృందం బుధవారం తొలుత యాదమరి మండలం కోణాపల్లి ప్రాంతంలో పర్యటించనుంది. ముగ్గురు అధికారులు ఖరీఫ్ పంట నష్టంపై ఆరా తీయనున్నారు. రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు వారి క్షేత్ర పరిశీలన జరగనున్నట్లు మండల వ్యవసాయశాఖ అధికారి చరిత తెలిపారు. కాగా యాదమరి మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 1,217 హెక్టార్లు కాగా, 590 హెక్టార్లలో పంట సాగు అయ్యింది. మండలంలో 1,914 మంది రైతులు వేరుశనగ సాగు చేశారు. ఈ పంట పూర్తిగా దెబ్బతినింది. ఈ వివరాలను వ్యవసాయశాఖ అధికారులు మంగళవారం సాయంత్రం పక్కాగా సిద్ధం చేశారు. నష్టపోయిన ప్రతి పంట వివరాలను నివేదికల రూపంలో తయారు చేసి ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment