ఆక్రమణల పర్వం ఇలా..
● పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి వెంబడి మేలుందొడ్డి గ్రామ దాఖలా సర్వే నంబర్ 256/10లో ఉన్న 9.35 ఎకరాల అనాధీనం భూమిని కబ్జా చేసేందుకు 2011లోనే టీడీపీ నాయకులు ప్రయత్నించారు. ఫోర్జరీ సంతకాలతో ఈ భూమి రికార్డులు మార్చి హస్తగతం చేసుకునేందుకు చేసిన కుట్రలను అప్పటి రెవెన్యూ అధికారులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వెనక్కి తగ్గిన టీడీపీ నాయకులు... కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కన్ను మళ్లీ ఈ భూమిపై పడింది. ఇటీవల రాత్రికి రాత్రే ఓ టీడీపీ నాయకుడు ఆ భూమిని జేసీబీలతో చదును చేసి స్వాధీనం చేసుకున్నాడు. భూ రికార్డులను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కబ్జా పర్వంపై టీడీపీలోని మరో వర్గం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
● పుంగనూరు పట్ణణ ప్రజల కోసం జాతీయ రహదారి వెంబడి సర్వే నంబర్ 225/6లో 17 సెంట్ల భూమిని ఇండోర్ స్టేడియం కోసం 2004లో ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రూ.80 లక్షలు ఖర్చు చేసి ఇండోర్ స్టేడియం నిర్మించారు. ఈ స్టేడియాన్ని టీడీపీ నేతలు జూన్ 7వ తేదీ అర్ధరాత్రి జేసీబీలతో కూల్చివేసి, ఆక్రమించుకున్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుంది. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి, శాంతినగర్ సమీపంలో సర్వే నంబర్ 407, 408లో 2.50 ఎకరాల్లో వైఎస్సార్–జగనన్న కాలనీ ఏర్పాటు చేసి 83 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఇళ్లు పునాదుల దశలో ఉండగా ఇటీవల టీడీపీ నేతలు జేసీబీలతో వాటిని పూర్తిగా తొలగించి ఆక్రమించారు.
● పిచ్చిగుండ్లపల్లి రహదారిలో సర్వే నంబర్లు 336, 337, 342లో 10.55 ఎకరాల భూమిని జగనన్న కాలనీకి కేటాయించి 462 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ స్థలంలో 6 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు చదును చేసి కబ్జా చేశారు.
● రాగానిపల్లి సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద సర్వే నంబర్లు 71, 73, 74లో 23.14 ఎకరాలను పేదల ఇళ్ల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ భూమిలో 3 ఎకరాలను ఇటీవల కబ్జా చేశారు. సరిహద్దు రాళ్లను తొలగించేశారు. ఈ భూముల విలువ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది.
సాక్షి టాస్క్‌ఫోర్స్: అనాధీనం భూములు.. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు.. ఇండోర్ స్టేడియం.. ఇలా ఏదైనా ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. చదును చేసుకుని అమ్ముకుంటున్నారు. స్థాయి ఆధారంగా నాయకులు వాటాలు పంచుకుంటున్నారు. ఇదీ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఆరు నెలలుగా టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా. ఇప్పటివరకు సుమారు రూ.20 కోట్ల విలువైన సుమారు 21 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment