చెప్పినట్టు వినాల్సిందే... లేకుంటే మార్చేస్తాం
విజయపురం : అధికారులు మేము చెప్పింది వినాల్సిందేనని టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో అధికారులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడిని అధిగమించి ఎవరైనా టీడీపీ నేతల మాట వినకుంటే వెంటనే ఆ అధికారులను తమ అధికార బలంతో మార్చేస్తున్నారు. దీనికి విజయపురం ఇన్‌చార్జి ఎంపీడీఓ ను మార్చి మరొకరికి ఇన్‌చార్జి అప్పగించడమే సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నికల అనంతరం విజయపురం ఎంపీడీఓగా ఉన్న చంద్రమౌళి కార్వేటినగరం మండలానికి బదిలీ అయ్యారు. దీంతో నగరి ఈఓపీఆర్‌డీ అరుణమ్మకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే రాత్రికి రాత్రే టీడీ పీ నాయకులు ఆ ఆర్డర్లను రద్దు చేయించి, విజయపురం ఏఓ రమణప్రసాద్‌కు బాధ్యతలు అ ప్పగించారు. మూడు నెలలు తిరగక ముందే వారి మోజు తీరిపోయింది. చెప్పినవన్నీ చేయ డం లేదని ఎంపీడీఓపై అక్కసు పెంచుకున్నారు. అంతే ఆయన స్థానంలోకి ఈఓపీఆర్డీ రాజేంద్ర ఇన్‌చార్జ్ ఎంపీడీఓ అయిపోయారు. మండలంలో 20 వేల మంది జనాభాకు సేవలు అందించే కీలకమైన ఎంపీడీఓ పోస్టుకు నిత్యం ఒకరు మారుతుండడంతో జనం విస్తుపోతున్నారు. మూడు నెలలకే ముగ్గురు ఎంపీడీఓలు మారడం ఇక్కడ అధికార పార్టీ వ్యవహార శైలికి అద్దం పడుతోంది. ఇప్పుడు ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎన్ని నెలలుంటారో అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. నిబంధనల ప్రకారం పని చేస్తే..మార్చేడం ఖాయమని, స్వామి భక్తి చూపిస్తేనే కొనసాగే వీలుంటుందని బాహాటంగా చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment