సై అంటే సై
● మొండివెంగనపల్లెలో దుమ్మురేపిన ఎడ్లపందేలు
వెదురుకుప్పం : సై అంటే సై అన్నట్లు సోమవారం వెదురుకుప్పం మండలంలోని మొండివెంగనపల్లెలో సాగిన జల్లికట్టు యువకుల్లో జోష్ తెచ్చింది. రంకెలేస్తూ దూసుకుపోయిన కోడెగిత్తలు...ఈలలు కేకలతో పలకల కోసం యువత చేసిన సాహసాలు...పోట్లగిత్తల పరుషానికి బెంబేలెత్తిన జనం... ఎడ్ల పందేలు జోరుగా హుషారుగా సాగాయి. దమ్ముంటే కాసుకో అన్నట్లు సాగిన ఎడ్ల పందేల్లో కోడిగిత్తలదే పైచేయి అయ్యింది. మెండివెంగన్నపల్లెలో జరిగిన జల్లికట్టుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పశువులను తీసుకొచ్చారు. నిర్వాహకులు ఎడ్లకు పలకలు, వస్త్రాలు కట్టి పందేనికి సిద్ధం చేసి, ఉసిగొల్పారు. అప్పటికే అధిక సంఖ్యలో గ్రామానికి చేరుకున్న యువత పందేనికి సై అంటే సై అన్నట్టు కోడెగిత్తల కొమ్ములు వంచడానికి ప్రయత్నించారు. అయితే గిత్తలు రంకెలేసుకుంటూ జన ప్రవాహాన్ని చీల్చుకుంటూ దూసుకుపోయాయి. కాగా కొన్ని ఎడ్ల వేగాన్ని నిలువరించి పలకలు పట్టి తమ ప్రతాపాన్ని చూపారు. అయితే పోట్లగిత్తలు జన ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా జనాన్ని చీల్చుకుంటూ పరుగులు తీసి, తమదే పై చేయి అనిపించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment