డీఎస్సీకి
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలన్న కల నెరవేర్చుకోవడానికి సిద్ధమవుతున్న అభ్యర్థులను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచేస్తోంది. మెగా డీఎస్పీ అంటూ తొలి సంతకం చేస్తూ హడావుడి చేసిన సీఎం చంద్రబాబు ఆ తరువాత మూడు సార్లు వాయిదా వేశారు. దానికి ఎస్సీ వర్గీకరణ లింకు పెట్టారు. ఆ నివేదిక వచ్చిన తరువాతనే డీఎస్సీ అంటూ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో ఆరు నెలలుగా కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
కూటమి నిర్వాకం
మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలిసంతకం అని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతే హడావుడిగా సంతకం కూడా చేశారు. ఆ తరువాత రోజుకో సాకు చూపుతూ వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తాజాగా ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చిన తరువాతనే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీంతో నెలల తరబడి వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిరుద్యోగులు మాత్రం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఉద్యోగంపై నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లుతున్నాయి.
కార్వేటినగరం: నవ సమాజ నిర్మాణంలో పాలుపంచుకోవాలంటే ఉపాధ్యాయులు కావడమే ఉత్తమ మార్గ మని భావించిన అభ్యర్థులు ప్రస్తుతం కోచింగ్ సెంటర్లలో మగ్గిపోతున్నారు. ఒంగోలు, కర్నూలు, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చి తిరుపతి కోచింగ్ సెంటర్లలో చేరారు. రెండు నెలల్లో కోచింగ్ పూర్తి చేసుకుని పరీక్ష రాసేయచ్చు అన్న ఆలోచనతో వచ్చేశారు. అయితే డీఎస్సీ వాయిదాలు పడుతూ ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ కోచింగ్ వదులుకోలేక, ప్రైవేటు కంపెనీలలో తక్కువ జీతాలకే కార్మికులుగా చేరుతున్నారు.
వాయిదాలకు సాకులు
తొలుతేమో టెట్ మరోసారి నిర్వహించి ఆ పై డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పింది. ఆ తరువాత గతంలో డీఎస్సీపై కోర్టు కేసులు పరిశీలించి అడ్డంకులు తొలగించి నోటిపికేషన్ ఇస్తామని వాయిదా వేసింది. తాజాగా ఎస్సీ వర్గీకరణ నివేదిక వచ్చిన తరువాత నిర్వహిస్తామంటూ లింకు పెట్టింది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక వచ్చేదెప్పుడు, డీఎస్సీ నిర్వహించేదెప్పుడని అభ్యర్థులు అయోమయంలో మునిగిపోయారు.
జిల్లాలో ఖాళీలు ఇలా...
జిల్లా వ్యాప్తంగా 2025 ఏప్రిల్ చివరి నాటికి స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీకి సంబంధించి 1,473 పోస్టులు ఖాళీ కానున్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ కేడర్ పోస్టులు 543, ఎస్‌జీటీ పోస్టులు 930 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల వివరాలు ఇంగ్లీష్ 105, హిందీ 22, మ్యాథ్స్ 33, ఫిజికల్ సైన్సు 29, జువాలజీ 68, సోషియల్ 132, ఫిజికల్ ఎడ్యుకేషన్ 87, ఇతర కేడర్లలో 47 పోస్టులు ఖాళీలున్నాయి. అయితే ఎన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందోనన్న ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది.
అమలుకాని బాబు తొలి సంతకం మెగా డీఎస్సీ అంటూ ప్రగల్భాలు నిర్వహణపై రోజుకో ప్రకటన ఇప్పటికే మూడు సార్లు వాయిదా
Comments
Please login to add a commentAdd a comment