![● తగ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/birdflu_mr-1739415050-0.jpg.webp?itok=ORlMoi8E)
● తగ్గిన చికెన్ ధరలు ● ప్రస్తుతం కిలో చికెన్ రూ.180 ●
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లాలో బర్డ్‌ఫ్లూ ఫీవర్ పట్టుకుంది. గోదావరి జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావం జిల్లాను తాకింది. దీంతో జిల్లా ప్రజానీకం, పాల్ట్రీ యాజమాన్యాలు వణుకుతున్నాయి. ఇప్పటికే చికెన్ ధరలు పడిపోయాయి. ముక్క ముట్టేందుకు చికెన్ ప్రియులు భయపడుతున్నారు. పశుసంవర్థశాఖ అధికారులు భయపడొద్దని సూచిస్తున్నారు.
జిల్లాలో సరఫరా ఇలా..
జిల్లాలో 8 వేల కుటుంబాలు కోళ్ల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అలాగే 25 వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఈ ఫారాల్లో నెలకు 75 లక్షల నుంచి 80 లక్షల వరకు బ్రాయిలర్స్ , 3 లక్షలు నాటు కోళ్లు, 45 లక్షల లేయర్స్ కోళ్లు, లింగాపురం 1.10 లక్షల వరకు పెంపకం సాగుతోంది. రోజువారీగా బ్రాయిలర్స్ 2 లక్షల కోళ్లు కడప, చైన్నె, అనంతపురం, కర్ణాటక సరఫరా అవుతున్నాయి. మరో 60 వేల కోళ్లు జిల్లా నలుమూలలకు రావాణా అవుతున్నట్లు ఫ్రాల్టీ రంగం లెక్కలు చెబుతోంది. ఇందులో 5 శాతం మరణాలుంటాయని అంటున్నాయి. కొన్ని రోజులకు ముందు చికెన్ రూ. 260 వరకు పలికింది. ప్రస్తుతం చికెన్ ధర రూ. 180కు దిగజారింది. పడిపోయిన ధరలతో లైవ్ కోడి ధర రూ. 75కు పలుకుతోంది. ఈ ధరతో గిట్టుబాటు కాదని, లైవ్ రూ.95కు విక్రయిస్తేనే గిట్టుబాటు ఉంటుందని పెంపకందారులు వాపోతున్నారు. దీనికి తోడు కోడిగుడ్లు సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు విక్రయాలవుతున్నాయి. ప్రస్తుతం ఈ ధర మార్కెట్లో రూ.6కు పడిపోయింది.
గోదారి జిల్లా ఎఫెక్ట్..
ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ విజృంభించింది. అక్కడ వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆయా ప్రాంతాలకు చెందిన కోళ్లు, కోడిగుడ్లు ఈ ప్రాంతానికి రవాణా అయితే వాటి ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం అధికంగా ఉంది. అక్కడి నుంచి దిగుమతి అయిన కోళ్లు, కోడి గుడ్లు ఆహారంగా తీసుకుంటే ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. కోళ్ల మేత, రవాణా వాహనాల ద్వారా, కొంగలు, ఇతర పక్షుల జాతులు వలస రావడంతోనూ ఫ్లూ విజృంభించే అవకాశం ఉంటుందని జిల్లా వాసులు వణుకుతున్నారు. దీని కారణంగా జిల్లాలో చికెన్ వ్యాపారం ఢల్ అయింది. ఇక జిల్లా నుంచి కుంభమేళాకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో చికెన్ తినే వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీనికి తోడు ఎండ తీవ్రత అధికమైంది. ఈ ప్రభావంతో కోళ్ల పెంపకం తగ్గుతూ వస్తోంది. కోళ్ల సరఫరా తగ్గుముఖం పట్టాయి. చికెన్ షాపులు వెలవెల బోతున్నాయి. బిర్యానీ తినే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ ఎఫెక్ట్ పూర్తిగా కోళ్ల పరిశ్రమ పడింది.
రాష్ట్రంలో బ్లర్డ్‌ఫ్లూ వ్యాప్తితో జిల్లాలోని కోళ్ల పరిశ్రమదారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల సంరక్షణపై మరింత దృష్టి సారించారు. పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు వాలకుండా చూసుకుంటున్నారు. చిన్న జబ్బు పడిన అప్పుడే వైద్యులకు సమాచారం అందిస్తున్నారు. కోళ్లు చనిపోతే అవి ఏ జబ్బుతో చనిపోయిందో డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. సరఫరా విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నారు. అప్రమత్తంగా వ్యవహరిస్తూ కోళ్ల పరిశ్రమను కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈ ఎండ తీవ్రత పరిశ్రమను మరింత కష్టాల్లోకి తీసుకెళ్లవచ్చునని వ్యాపారులు ఢీలాపడుతున్నారు. పశుసంవర్థశాఖ అధికారులు ఇతర జిల్లాల నుంచి కోళ్ల రవాణాను నివారించేందుకు చెక్‌పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
సంరక్షణలో జాగ్రత్తలు పాటిస్తున్నాం
జిల్లాలో కోళ్ల పెంపకందారులు కోళ్లను జాగ్రత్తగా పెంచుతున్నారు. ఏ చిన్న బబ్బు పడినా కోళ్ల డాక్టర్‌ను పిలిచి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. జిల్లాలో ఇంత వరకు ఎప్పుడు బ్లర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదు. ఇప్పుడు మరింత జాగ్రత్త పడుతున్నాం. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పరిశ్రమ వ్యవహరించదు. ఇప్పటికే కోళ్ల పరిశ్రమ దెబ్బ పడింది. ఎండల తీవ్రతతో మరింత నష్టం కలగనుంది.
–వెంకట్‌రెడ్డి, జనరల్ మేనేజర్, ప్రీమియమ్ చిక్ ఫీడ్స్ ప్రవేట్ లిమిటెడ్, చిత్తూరు
పూర్తి స్థాయిలో నిఘా ఉంచాం
జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ లక్షణాలు నమోదు కాలేదు. అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలకు ఉపక్రమించాం. పూర్తి స్థాయిలో నిఘా ఉంచుతున్నాం. పౌల్ట్రీ యజమానులకు శానిటేషన్, రక్షణ చర్యలపై సూచనలు ఇచ్చాం. పక్షుల ద్వారా వ్యాప్తికి ఆస్కారం అధికంగా ఉంది. కోళ్ల ఫారాల వద్ద పక్షుల సంచారం లేకుండా చర్యలు చేపట్టాలి.అపోహలకు ప్రజలు భయపడాల్సిన పనిలేదు. కోడి గుడ్లు, మాంసంను బాగా ఉడికించి తినాలి.
– ప్రభాకర్, జేడీ, పశుసంవర్థశాఖ, చిత్తూరు
![● తగ్గిన చికెన్ ధరలు ● ప్రస్తుతం కిలో చికెన్ రూ.180 ●1](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12ptp42-300010_mr-1739415050-1.jpg)
● తగ్గిన చికెన్ ధరలు ● ప్రస్తుతం కిలో చికెన్ రూ.180 ●
![● తగ్గిన చికెన్ ధరలు ● ప్రస్తుతం కిలో చికెన్ రూ.180 ●2](https://www.sakshi.com/gallery_images/2025/02/13/12ptp43-300010_mr-1739415050-2.jpg)
● తగ్గిన చికెన్ ధరలు ● ప్రస్తుతం కిలో చికెన్ రూ.180 ●
Comments
Please login to add a commentAdd a comment