జగ్గంపేట: ఒక్కోసారి మృత్యువు ఏ రూపంలో.. ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు ఆనందంగా సాగుతున్న ప్రయాణాలు సైతం అర్ధాంతరంగా ముగిసిపోతాయి. కుటుంబాల్లో పెను విషాదాలను నింపుతాయి. అలాంటి సంఘటనే గురువారం జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద చోటుచేసుకుంది. దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్‌లోని తన తల్లి ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన ఆమె కొడుకు, అల్లుడు.. ఇక్కడ పని ముగించుకుని.. తిరిగి కారులో విశాఖపట్నం బయల్దేరారు. జగ్గంపేట మండలం మల్లిసాల వద్ద వారు ప్రయాణిస్తున్న కారు విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టడంతో అది కారుపై పడి కరెంట్‌షాక్‌తో మంటలు వ్యాపించి వారిద్దరూ మృతి చెందారు. వెనుక సీటులో కూర్చున్న ఓ యువకుడు, ఇద్దరు మహిళలు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వీరందరూ విశాఖపట్నం వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు.
దేవీపట్నం మండలం ఫజుల్లాబాద్ గ్రామానికి చెందిన మట్టా సతీష్, అతడి అక్కలు విశాఖపట్నంలో ఉంటున్నారు. తల్లి కామాక్షి ఫజుల్లాబాద్‌లోనే ఉంటోంది. ఆమె ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరిగింది. ఇదే విషయాన్ని విశాఖపట్నంలో ఉంటున్న కొడుకు మట్టా సతీష్(41), అల్లుడు వీర్ని హనుమంతరావు(56)లకు తెలిపింది. చోరీ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వారు విశాఖ నుంచి బుధవారం ఫజుల్లాబాద్ వచ్చారు. వీరితో పాటు కూతుళ్లు మన్నెం చంద్రభాను, వీర్ని రమాదేవి, మనవడు మన్నెం ఆదిత్య కూడా వచ్చారు. బుధవారం అన్ని పనులు పూర్తి చేసుకుని విశాఖపట్నానికి తిరిగి ప్రయాణమయ్యారు.
రెండు గంటల్లోనే జీవితాలు తారుమారు
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వీర్ని హనుమంతరావు, మట్టా సతీష్ ఇరువురూ బావ, బావమరుదులు. వెనుక సీటులో ఉన్న మన్నెం చంద్రభాను, వీర్ని రమాదేవి గాయపడడంతో వారిని జగ్గంపేట సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ మన్నెం ఆదిత్య కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారందరూ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జగ్గంపేట సీఐ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై రామకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పరిశీలించారు.
ఫజుల్లాబాద్‌లో నివసిస్తున్న మట్టా కామాక్షి ఇంటిలో జరిగిన చోరీ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు కొడుకు, అల్లుడు కుటుంబసభ్యులతో విశాఖపట్టణం నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రమాదంలో మరణించిన వీర్ని హనుమంతరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ప్రమాదంలో మరణించిన మట్టా సతీష్‌కు తన పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. వరుసకు వీరిద్దరూ బావ, బావమరిది, మామ, అల్లుళ్లు అవుతారు. వీర్ని హనుమంతరావు భార్య రమాదేవి ప్రమాదంలో గాయపడింది. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు హనుమంతరావే. ఇతడు విశాఖ పట్టణంలోని వన్ టౌన్ ఏరియాల్లో ఈయన చికెన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మట్టా సతీష్ విశాఖపట్నం వన్ టౌన్ ఏరియాలో తనతల్లి కామాక్షి పేరున మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య, అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. స్వగ్రామం ఫజుల్లాబాద్ అయినా విశాఖలో స్థిరపడ్డారు. కొడుకు, అల్లుడిని కోల్పోయిన కామాక్షి తీవ్రంగా విలపిస్తోంది.
ప్రమాదం జరిగిందిలా..
గురువారం ఉదయం 6.30 గంటలకు వారందరూ కలసి మారుతి 800 కారులో ఫజుల్లాబాద్ నుంచి విశాఖ బయలుదేరారు. మట్టా సతీష్ కారు నడుపుతుండగా, అతడి పక్క సీటులో వీర్ని హనుమంతరావు కూర్చుకున్నారు. వెనుక సీటులో మన్నెం ఆదిత్య, అతడి తల్లి మన్నెం చంద్రభాను, వీర్ని రమాదేవి కూర్చున్నారు. కారు మల్లిసాల వద్ద ఉన్న సింగరమ్మ తల్లి ఆలయం దాటింది. కొద్ది దూరం వెళ్లేసరికి రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఆ స్తంభం విరిగి కారుపై పడింది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తలలోకి విద్యుత్ స్తంభం ఊచ దిగిపోయింది. డ్రైవర్ సీటు పక్క డోరుకు విద్యుత్ తీగలు అడ్డుగా ఉండిపోయాయి. వెనుక సీటులో ఉన్న ఆదిత్య కిటికీలో నుంచి దూకి వెనుక డోరు తీసి తల్లి, పెద్దమ్మను బయటకు లాగి రక్షించాడు. కారులో ఉన్న వారికి విద్యుత్ షాక్ తగిలింది. ముందు సీటులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నంలో ఉండగా కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారు అగి్నకి ఆహుతయ్యారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడం, ఫైర్ ఇంజిన్ రావడంతో మంటలు అదుపు చేసి లోపల ప్రాణాలు కోల్పోయిన వారిని బయటకు తీశారు.
ఎవరూ సాయం చేయలేదు..
‘‘అప్పటి వరకు సరదాగా కబుర్లు చెప్పుకొంటూ వెళుతున్నాం.. ఇంతలోనే ఒక్కసారిగా కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడం, ఆ స్తంభం కారుపై పడడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎదురు సీటులో ఉన్న మా పెదనాన్న డోరు తీసుకుని బయటకు రావడానికి ప్రయత్నించేసరికి విద్యుత్ తీగలు డోరుకు తగిలి ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. డ్రైవింగ్ సీటులో ఉన్న మా మామయ్య సతీష్ కారు దిగుదామంటే విద్యుత్ స్తంభం ఊచ ఆయన తలలో దిగిపోయి.. కదల్లేని పరిస్థితి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించుకోవడానికి స్థానికులను పలిచినా ఎవరూ ముందుకు రాలేదు. కనీసం ఏ ఒక్కరు సాయం చేసినా మా మామయ్య, పెదనాన్నలను కాపాడుకునేవాడిని’’ అంటూ కారు ప్రమాదం నుంచి బయటపడిన మన్యం ఆదిత్య కన్నీటిపర్యంతమయ్యాడు.
తాను కిటికీలో నుంచి దూకి డోరు తీసి అమ్మను, పెద్దమ్మను బయటకు లాగానని, మావయ్య, పెదనాన్నను కాపాడుకోవడానికి విద్యుత్ తీగలను కర్రతో కారుకు దూరంగా తప్పిస్తే సరిపోయేదని తెలిపాడు. దీనికి ఎవరూ సహకరించలేదన్నాడు. ఈ సమయంలో కారులో నుంచి మంటలు వ్యాపించి పెదనాన్న వీర్ని హునుమంతరావు, మావయ్య మట్టా సతీష్ కేకలు వేయడం ప్రారంభించారని, వారిని రక్షించుకునే దారిలేక పోయిందన్నాడు. విద్యుత్ తీగల వల్ల చెలరేగిన మంటల వల్లే వారిద్దరూ మృతి చెందారని అంతా క్షణాల్లో జరిగిపోయిందని బోరున విలపించాడు.
-కారు ప్రమాదంలో బయటపడ్డ ఆదిత్య కుమార్
Comments
Please login to add a commentAdd a comment