మాట్లాడుతున్న సిట్ డీఐజీ అశోక్‌కుమార్
వత్సవాయి/పెనుగంచిప్రోలు/నందిగామ: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో గతేడాది సెప్టెంబర్ 10న నంది విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గుప్త నిధుల కోసమే ఓ ముఠా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ నాగేశ్వరరెడ్డిలతో కలిసి కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అవి..
ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయనే నమ్మకంతో ఏడుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని పురాతన ఆలయాల్లో రెక్కీ నిర్వహించారు. ఇదే క్రమంలో మక్కపేటలోని శివాలయంలో మొదటిసారి ప్రవేశించి నంది విగ్రహం చెవులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అనంతరం.. విగ్రహం పొట్ట భాగంలో విలువైన వజ్రాలున్నాయన్న భావనతో రెండోసారి వచ్చిన ముఠా సభ్యులు గుడిలో పూజ చేయించుకుని వెళ్లిపోయారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజి పరిశీలించి విచారణ ప్రారంభించారు. చివరకు.. హైదరాబాద్‌కు చెందిన అనుగొండ్ల శ్రీనివాసరావు, ఇట్టబోయిన విజయ్, మదని రామకృష్ణ, వికారాబాద్ జిల్లాకు చెందిన చిట్యాల కృష్ణయ్య, గంపలగూడెంకు చెందిన అరిపిరాల వెంకటప్పయ్య శాస్త్రిలతోపాటు రంగురాళ్ల వ్యాపారులు నాగేశ్వరరావు, గోపాలరావులను శుక్రవారం అరెస్టుచేశారు. వారి వద్ద పలు ఆలయాల ఫొటోలు, వీడియోలతోపాటు విలువైన సమాచారాన్ని సేకరించారు.
రెక్కీ నిర్వహించిన ఆలయాలు ఇవే..
ప్రకాశం జిల్లా పొదిలి శివాలయం, దర్శి సమీపంలోని దేకలకొండపై ఉన్న లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, గిద్దలూరు మండలం గుడిమెట్లలోని ఆంజనేయస్వామి ఆలయం, యర్రగొండపాలెంలోని చెన్నకేశవస్వామి ఆలయం, గుంటూరు జిల్లా దుర్గి శివాలయం, వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని ఆంజనేయస్వామి ఆలయం, నల్గొండ జిల్లా హాలియా పేరూరు గ్రామంలోని శివాలయం, వరంగల్ జిల్లా రంగసాయిపేటలోని రామాలయంలో గుప్త నిధుల కోసం రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలిందని సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల్లో గుప్త నిధుల కోసం వేట సాగించే 25 ముఠాల్లోని సుమారు 70 మంది సభ్యులను గుర్తించామన్నారు. కాగా, కేసును ఛేదించేందుకు కీలక సమాచారం అందించిన మక్కపేట శివాలయ అర్చకుడు యుగంధర శర్మను సిట్ అధికారితోపాటు జిల్లా ఎస్పీ సత్కరించారు. అలాగే, కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పలువురు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment