మహిళ ఇంటి ముందు నిరసన తెలుపుతున్న బాధిత మహిళలు (ఇన్‌సెట్లో) పరారైన మహిళ
సాక్షి, ఒడిశా (రణస్థలం): రెండు వందల మంది మహిళలను మోసం చేసి రూ.20 కోట్లతో ఓ మోసగత్తె ఉడాయించింది. ఏడో తరగతి మాత్రమే చదివిన మహిళ చిట్టీలు, వడ్డీల పేరుతో అధిక మొత్తాలు వసూలు చేసి ఆఖరికి బిచాణా ఎత్తేసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పైడిభీమవరం గ్రామానికి చెందిన లింగం నీలవేణి అనే మహిళ అదే గ్రామంలో కొంతమంది మహిళలను చేరదీసి చిట్టీలు ఎత్తడం మొదలుపెట్టింది. ఇలా 2015లో ఒకటి, రెండో చీటీలతో మొదలైన ప్రయాణం 2017కు అధిక వడ్డీలు ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేయడం వరకు వెళ్లింది. చెప్పిన వడ్డీలు రెండేళ్లపాటు సక్రమంగా చెల్లిస్తుండడంతో మహిళలంతా అకర్షితులై ఒక్కొక్కరుగా రూ.10 లక్షలు, రూ.50 లక్షలు, రూ.70 లక్షలకుపైగా వడ్డీలకు, చిట్టీలు కట్టడానికి ఇచ్చేశారు.
సగరం నాగమణి అనే మహిళ అయితే నీలవేణిని నమ్మి కోటి రూపాయలకు పైగా తనకు తెలిసిన మహిళలతో చిట్టీలు కట్టించి, వడ్డీలకు ఇప్పించారు. ఇలా పైడిభీమవరంతో పాటు చుట్టు పక్కల గ్రామాల మహిళలైన కొమ్ములూరు తవిటమ్మ రూ.70 లక్షలు, జి.అనురాధ రూ.52 లక్షలు, జి.పార్వతి రూ.18 లక్షలు, ఇనపకూర్తి ఆదిలక్ష్మి రూ.8 లక్షలు, ఎం.ఆదిలక్ష్మి రూ.6 లక్షలు, మరి కొందరు మహిళలు రూ.44 లక్షలు, రూ.61 లక్షలు ఇలా వడ్డీలకు, చిట్టీల రూపంలో నీలవేణికి అప్పగించేశారు. తాను యలమంచిలిలో ఫైనాన్స్ నడుపుతున్నానని, మీ సొమ్ములకు నాది హామీ అని చెప్పిందే గానీ ఒక్కరితోనూ ప్రామిసరీ నోటు, రిజిస్ట్రేషన్ బాండ్‌లు కూడా రాయించలేదు. నెలవారీ వడ్డీలతో సహా డబ్బులు చక్కగా వచ్చేస్తున్నాయని మహిళలంతా ఆమెను నమ్మి కోట్లాది రూపాయలను ఆమె చేతుల్లో పెట్టేశారు. (వివాహేతర సంబంధం.. నీవు లేక నేను లేనంటూ)
అప్పుడప్పుడు ఆ మహిళ గోనె సంచులతో డబ్బులు తీసుకురావడం, ఆ సొమ్ములు తోటి మహిళలకు చూపడంతో నీలవేణికి వడ్డీకి డబ్బులు ఇస్తే అధిక వడ్డీ వస్తుందనే ఆశతో తండోపతండాలుగా ఆమె ఇంటికి క్యూ కట్టేవారు. అయితే ఇటీవల కరోనాకు ముందు విజయనగరం నుంచి వస్తుండగా రూ.2.60 కోట్ల సోమ్ము దొంగలు పట్టుకుని వెళ్లిపోయారని నమ్మించింది. మరో రూ.6 కోట్లు యలమంచిలి ఫైనాన్స్‌లో ఉన్నాయని కథలు చెప్పడం మొదలు పెట్టింది. చిట్టీలు పాడిన డబ్బులు ఇదిగో ఇచ్చేస్తుŠాన్ననని, వడ్డీలకు వాడిన సొమ్ములు అదిగో ఇచ్చేస్తున్నాని డ్రామాలు ఆడుతూ రోజులు గడపడంతో మహిళలందరికీ అనుమానం పెరిగింది.
సోమవారం ఉదయం కొంతమంది మహిళలు ఇంటికి వెళ్లి నిలదీసే సరికి, వెనక నుంచి మెల్లగా పరారైంది. ఆమె భర్త రెడ్డీస్ లేబరేటరీలో రోజు వారీ కూలీగా పని చేస్తున్నారు. కుటుంబ సభ్యులందరినీ బాధిత మహిళలు మా డబ్బులు ఎవరిస్తారని ప్రశ్నిస్తే మాకేంటి సంబంధం అంటూ తప్పించుకుంటున్నారు. దీంతో మోసం చేసి పరారైన మహిళ ఇంటి ముందు బాధితలు టెంటు వేసి నిరసన చేపట్టారు. సంఘటన తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో బాధిత మహిళలు జరిగిన సంఘటన గురించి వివరించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తామని జె.ఆర్.పురం ఎస్‌ఐ ఈ.శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment