వానసడి..అలజడి | - | Sakshi
Sakshi News home page

వానసడి..అలజడి

Published Fri, Oct 18 2024 3:04 AM | Last Updated on Fri, Oct 18 2024 3:04 AM

వానసడి..అలజడి

ఖరీఫ్‌ పంటకు ముప్పు

మూడు రోజులుగా భారీ వర్షాలు

ఓడలరేవులో అలల విధ్వంసం

కోతకు గురవుతున్న

ఓఎన్జీసీ టెర్మినల్‌ వెనుక భాగం

సాక్షి, అమలాపురం/ అల్లవరం: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం జిల్లాపై పడింది. ఒకవైపు అడపా దడపా కురుస్తున్న భారీ వర్షాలు.. మరోవైపు తీరంలో విరుచుకుపడుతున్న అలలు.. ఇటు ఖరీఫ్‌ రైతులు, అటు తీరంలోని మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఖరీఫ్‌ రైతులను సాగు ఆరంభం నుంచి ముగింపు వరకూ వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆకుముడుల సమయంలో.. వరి చేలు దబ్బులు చేస్తున్నప్పుడు.. తాజాగా పాలుపోసుకుని గింజ గట్టిపడుతున్న దశలోనూ వర్షాలు చావు దెబ్బతీశాయి. నైరుతిలో అంచనాలకు మించి కురిసిన వర్షాలతో ఈ ఏడాది దిగుబడి పడిపోతోందని రైతులు వాపోతున్నారు. తాజాగా వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న వానలు ఖరీఫ్‌ వరి రైతులకు ఇబ్బందిగా మారింది. ముంపు పెద్దగా లేకున్నా, అధిక వర్షాలతో దిగుబడి తగ్గుతోందని రైతులు వాపోతున్నారు. జూలై నెలలో వర్షాలు వరి చేలు ఆకుమడుల దశలోనే దెబ్బతిన్నాయి. సెప్టెంబర్‌ మొదటి వారం, తాజాగా కురుస్తున్న వర్షాలకు ఈనిక దశలో ఉన్న చేలు దెబ్బతింటున్నాయి. దిగుబడి తాలు, తప్పలు అధికంగా వస్తాయని రైతులు వాపోతున్నారు. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలులోని తీర ప్రాంతాల్లో ఖరీఫ్‌ దిగుబడి చాలాచోట్ల 20 బస్తాలు (బస్తా 75 కిలోలు) మించి రాదని వాపోతున్నారు. వర్షాలతో మురుగునీటి కాలువలు పొంగి పొర్లుతుండగా, రోడ్లపై నీరు చేరి వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.

తీరం పొడవునా కోత

అల్పపీడనం ప్రభావంతో ఓడలరేవు తీరంలో సముద్రం విధ్వంసం సృష్టించింది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన అలల ఉధృతికి ఓడలరేవు తీరం పొడవునా కోతకు గురవుతోంది. తీరంలో సముద్రం ఒడ్డున చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ ప్లాంట్‌కు రాకాసి అలల తాకాయి. పెద్ద ఎత్తున ఎగసిపడిన కెరటాలు ప్లాంట్‌కు రక్షణగా ఉన్న ప్రహరీని బలంగా తాకడంతో రోడ్డుపై ఇసుక చేరింది. రాకాసి అలల ఉధృతికి టెర్మినల్‌ గేటు నుంచి సముద్ర జలాలు ప్లాంట్‌లోకి చేరాయి. 2018 ఆగస్ట్‌లో ఇదే మాదిరి భారీ అలలకు తీరం పొడవునా వేలాది ఎకరాల సరుగుడు తోటలు కోతకు గురికాగా, రోడ్లను సైతం తనలో కలిపేసుకుంది. మళ్లీ ఆరేళ్ల తర్వాత భారీ అలలతో విధ్వంసం సృష్టించి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. టెర్మినల్‌ పొడవునా, వెనుక వైపున ఉన్న ఆక్వా చెరువులను భారీ అలలు ముంచెత్తాయి. రూ.లక్షలు వెచ్చించి ఆక్వా సాగు చేస్తే కెరటాల తాకిడితో రొయ్యల చెరువుల నిండా ఇసుక మేట వేసి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఆక్వా చెరువులను ముంచెత్తిన కెరటాలు టెర్మినల్‌కు పొడవునా నిర్మించిన బీటీ రోడ్డును ధ్వంసం చేసింది. రెండు చోట్ల రోడ్డు కుంగిపోయి, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఓడలరేవు గ్రామంలో మురుగునీరు దిగువనకు వెళ్లేందుకు నిర్మించిన డ్రైనేజీ ఇసుకతో నిండిపోయింది. భారీ కెరటాల విధ్వంసానికి టెర్మినల్‌లోకి వాహనాలు వెళ్లే అవకాశం లేకుండా చేసింది. చెత్తాచెదారం తొలగింపునకు చర్యలు చేపట్టారు. సునామీ తర్వాత ఓడలరేవు తీరాన్ని పరిశీలిస్తే సుమారు వంద మీటర్లకు పైగా తీరం కోతకు గురై ముందుకు వచ్చింది. ఓడలరేవుతోపాటు కొమరగిరిపట్నం, చిర్రయానాం, ఎస్‌.యానాం, అంతర్వేది వంటి ప్రాంతాల్లో సముద్ర అలలు ఎగిసిపడడంతో స్థానికులు, మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాలో వర్షపాతం ఇలా..

జిల్లాలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి గురువారం ఉదయం ఎనిమిది గంటల వరకూ 24.7 మిల్లీమీటర్ల సగటు వర్షంపాతం నమోదైంది. అత్యధికంగా మలికిపురం మండలంలో 57.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా కపిలేశ్వరపురం 6.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. సఖినేటిపల్లి 56, ఐ.పోలవరం 39.2, అమలాపురం 38.4, రాజోలు 34.6, ఉప్పలగుప్తం 34.4, కాట్రేనికోన 30.2, అంబాజీపేట 25.2, అల్లవరం 22.6, ముమ్మిడివరం 20.6, మామిడికుదురు 19, పి.గన్నవరం 22.4, కె.గంగవరం 18.2, అయినవిల్లి 19.6, రాయవరం 18.2, రామచంద్రపురం 17, మండపేట 18, కొత్తపేట 16.2, ఆలమూరు 13, రావులపాలెం 7.8, ఆత్రేయపురం 7.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement