నిర్లక్ష్యంతో ఢాం..ఢాం | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యంతో ఢాం..ఢాం

Published Fri, Oct 18 2024 3:04 AM | Last Updated on Fri, Oct 18 2024 3:04 AM

నిర్లక్ష్యంతో ఢాం..ఢాం

అనధికార బాణసంచా

తయారీపై నిఘా లోపం

వాటిని అదుపు చేస్తేనే ఆనంద దీపావళి

అమలాపురం విస్ఫోట ఘటనతో

ఉలికిపాటు

అమలాపురం టౌన్‌: దీపావళి.. వెలుగుల పండగ. చిన్నా, పెద్దలకు ఆనందమే నిండుగ.. అలాంటి పండగకు వినియోగించే సామగ్రి తయారీలో లోపాలు విస్ఫోటానికి దారితీస్తున్నాయి. అనధికార బాణసంచా తయారీ కేంద్రాల్లో విస్ఫోట ఘటనలు, ప్రాణ, ఆస్తి నష్టాలతో విషాదం ఆవరిస్తోంది. పటిష్ట నిఘాతో అనధికార తయారీ కేంద్రాలను పూర్తిగా అదుపు చేస్తే జిల్లాలో ఆనంద దీపావళి జరుపుకోవచ్చు. ఈ నెల 31న దీపావళి పర్వదినాన్ని ఆనందోత్సాహలతో జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నా, ఇటీవల అమలాపురం రావులచెరువు ప్రాంతంలో గృహాల మధ్య ఓ అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన విస్ఫోట ఘటన ఉలిక్కి పడేలా చేస్తోంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందడమే కాకుండా, ఏడుగురు తీవ్రంగా గాయపడి ఇంకా చికిత్స పొందుతున్న చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు 15 లోపే ఉంటే.. అనధికార కేంద్రాలు అంతకు మించే ఉన్నాయి. జిల్లాలోని 385 గ్రామాలు, 3 పట్టణాలు, ఒక నగర పంచాయతీలో 17 లక్షలకు పైగా ఉన్న ప్రజలకు ఈ దీపావళి ఆనంద కేళి అవుతుంది. అయితే మానవ తప్పిదాలు, నిఘా లోపాలతో ఏటా జరిగే దీపావళి పండగకు ముందు ఏదోమూల అనధికార బాణసంచా తయారీ కేంద్రంలో సంభవిస్తున్న విస్ఫోట ఘటనలతో ప్రాణ, ఆస్తి నష్టాలు అనివార్యమవుతున్నాయి.

మరింత నిఘా ఉంచేందుకు..

బాణసంచా తయారీ కేంద్రాలకు అధికారికంగా అనుమతులను అగ్నిమాపక శాఖ ఇస్తుంది. దీపావళికి బాణాసంచా దుకాణాలకు లైసెన్స్‌లు, పర్యవేక్షణను పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలు సంయుక్తంగా పర్యవేక్షిస్తాయి. జిల్లాలో గత సంవత్సరం దీపావళికి 424 దుకాణాలకు లైసెన్స్‌లు ఇచ్చారు. ఈ ఏడాది పండుగకు కూడా దాదాపు ఇదే స్థాయిలో లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. అయితే బాణాసంచా, మందుగుండు సామగ్రి తయారీ కేంద్రాలకు పర్మినెంట్‌ లైసెన్స్‌లు జారీచేస్తే అది అధికార తయారీ కేంద్రం అవుతుంది. అధికార కేంద్రం ఏర్పాటుకు సవాలక్ష నిబంధనలు ఉంటాయి. జనావాసాలకు దూరంగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. తయారీ కేంద్రం వద్ద ప్రమాదం అనివార్యమైతే తక్షణమే అదుపు చేసేందుకు ఇసుక, నీటి నిల్వలు తగిన పరిమాణంలో విధిగా ఉండాలి. లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు పలు నిబంధనలు విధిగా అమలు చేయాలి. ఇలాంటి అనుమతులు, జాగ్రత్తలు లేకుండా కొందరు నివాస గృహాల మధ్యే అనధికారికంగా బాణసంచా తయారీని చేపడుతున్నారు. ఇటీవల అమలాపురంలో జరిగిన విస్ఫోట ఘటనకు ఇంట్లో అనధికారికంగా బాణసంచా తయారీ చేస్తున్నట్లు విజయవాడ ఫోరెన్సిక్‌ అధికారులు గుర్తించారు. ఇళ్లలోనే అనధికారికంగా బాణసంచా తయారీ చేసే వారిపై నిరంతర నిఘా ఉన్నప్పుడే ఇలాంటి దుర్ఘటనలను అరికట్టవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement