7నుంచి కోనసీమ క్రీడోత్సవం
మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలను అధికారులు విజయవంతం చేయాలి
అమలాపురం రూరల్: కోనసీమ క్రీడోత్సవం పేరిట జరిగే మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ విద్యా, క్రీడా ప్రాధికార అభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం వారితో ఆయన కలెకక్టరేట్‌లో సమావేశం నిర్వహించి పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7, 8, 9 తేదీలలో మండల క్రీడా పోటీలను ప్రైమరీ స్థాయిలో అథ్లెటిక్స్ ఈ వెంట్స్‌తో నిర్వహించాలని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థాయిలో అథ్లెటిక్స్‌తో పాటుగా కోకో, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించాలన్నారు. ఈ నెల 7, 8. 9 తేదీలలో హైస్కూల్ స్థాయిలో నిర్వహించే పోటీలలో గెలుపొందినవారు ఈ నెల 22, 23 తేదీలలో జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు. జిల్లా స్థాయి పోటీలు అనంతరం వివిధ శాఖల ఉద్యోగులతో క్రీడా పోటీలను నిర్వహించాలని యోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం ప్రక్రియను జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీంబాషా, జిల్లా క్రీడా ప్రాధికార అభివృద్ధి సంస్థ ముఖ్య శిక్షకులు పీఎస్ సురేష్‌కుమార్, కలెక్టరేట్ ఏవో ఏ.కాశీ విశ్వేశ్వరరావు, స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయులు గణేష్, రవి, రమణరావు, మూర్తి పాల్గొన్నారు.
కచ్చితత్వంతో పింఛన్ల తనిఖీ
ఎన్టీఆర్ భరోసా దివ్యాంగుల పింఛన్ల తనిఖీ ప్రక్రియ కచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో జీ.వీరపాండ్యన్ అమరావతి నుంచి 26 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్టీఆర్ భరోసా దివ్యాంగ పింఛన్ల తనిఖీ ప్రక్రియ విధివిధానాలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లలో అనర్హులు పింఛన్ పొందకుండా తనిఖీ ప్రక్రియను చేపట్టిందన్నారు. తనిఖీలలో లోపాలు ఉంటే సంబంధిత టీంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఆర్‌డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర్ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.దుర్గారావుదొర, డీసీహెచ్ ఎస్.డాక్టర్ కార్తీక్ రెడ్డి, డీపీవో శాంత లక్ష్మి, జీఎస్‌డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ విజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment