పోలీజుల సాక్షిగా పందేలు | - | Sakshi
Sakshi News home page

పోలీజుల సాక్షిగా పందేలు

Published Thu, Jan 16 2025 7:55 AM | Last Updated on Thu, Jan 16 2025 7:54 AM

పోలీజ

పోలీజుల సాక్షిగా పందేలు

హద్దులు మీరిన డ్యాన్స్‌లు

మామిడికుదురు మండలం గోగన్నమఠం, మలికిపురం మండలం కేశనపల్లి, జిల్లా కేంద్రం అమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా అశ్లీల నృత్యాలు (రికార్డింగ్‌ డ్యాన్స్‌లు) హద్దులు మీరి మరీ నిర్వహించారు. ఆ డ్యాన్స్‌లో కొందరు మహిళా కళాకారులు అశ్లీలతను మోతాదుని మించి ప్రదర్శించినా పోలీసులు పట్టించుకోలేదు. సాధారణ సమయంలో పేకాట, గుండాట, కోడి పందెం ఎక్కడ జరిగినా తక్షణమే దాడులు చేసి కేసులు నమోదుతోపాటు అరెస్ట్‌లు చేసే పోలీసులు సంక్రాంతి వేళ పత్తా లేకుండా పోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

అమలాపురం టౌన్‌: సంక్రాంతి సంప్రదాయాల ముసుగులో జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగిపోయాయి. జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల పరోక్ష ఆదేశాలతో పోలీసులు చేతులు ఎత్తేయడంతో పందేలు బరి తెగించి సాగాయి. సంక్రాంతి సంగ్రామంలో పందెం కోడి గెలిస్తే... వాటిని అదుపు చేయాల్సిన పోలీసులు ఓడిపోయారన్న విమర్శ జిల్లాలో కోడై కోసింది. పందేల కోళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నా, వేలాది మంది జనం ఒకే చోట గుమిగూడి కోడి,గుండాట పందేలు ఆడేస్తున్నా, అశ్లీల నృత్యాలు హద్దులు మీరి మరీ ప్రదర్శిస్తున్నా ఆయా ప్రాంతాల వైపు పోలీసు అధికారులు కనీసం చూడలేదు. అదుపు చేయాలన్న ఊసే లేదు. పోలీసులు సంక్రాంతికి ముందు కోడి పందేలపై ఉక్కుపాదం మోపుతామన్న హెచ్చరికలు ఉత్తి ప్రకటనలే అయ్యాయి.

మురమళ్లకి ప్రత్యేకత

జిల్లాలో సంక్రాంతి సంప్రదాయం పేరుతో దాదాపు 110 కోడి పందేల బరులు వెలిశాయి. ఇందులో ఐ.పోలవరం మండలం మురమళ్ల బరి హైటెక్‌ హంగులతో రూపుదిద్దుకుంది. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఈ బరిని ఉభయ గోదావరి జిల్లాల పందేల ప్రియులను ఆకర్షించే రీతిలో ప్రత్యేకంగా తయారు చేయించి మరీ తానే అన్నీ అయి ఆడించారు. క్రికెట్‌ స్టేడియంలో గ్యాలరీ మాదిరిగా ప్రేక్షకులు కూర్చునే ఏర్పాట్లు, పందేలను ఏ వైపు నుంచైనా సునాయాసంగా వీక్షించేలా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. పండగల కోసం స్వగ్రామాలకు హైదరాబాద్‌ నుంచి కార్లలో వచ్చి మరీ ఈ బరిలో పందేలును వీక్షించారు. ఎమ్మెల్యే బుచ్చిబాబు మూడు రోజుల నుంచి బరిలో దగ్గరుండి మీరీ పందేలను పర్యవేక్షిస్తూ వీక్షిస్తుంటే కనుమ పండుగ రోజున రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌, అమలాపురం, కాకినాడ ఎంపీలు గంటి హరీష్‌ మాథూర్‌, టి. ఉదయ శ్రీనివాస్‌, సినీనటి హేమ కూడా వీక్షించారు. ప్రతీ నియోజకవర్గంలో 10 నుంచి 20 బరులు ఏర్పాటైతే అమలాపురం నియోజకవర్గంలో మాత్రం 25 గ్రామాల్లో 30 బరులు ఏర్పాటయ్యాయి. కొత్తపేట, మండపేట, రాజోలు, పి.గన్నవరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లోని బరుల్లో పందేలరాయుళ్లు చెలరేగి మరీ కోడి పందేలను ఆడించారు. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ పందేలు కాశారు. మురమళ్ల బరిలో అయితే రూ.5 లక్షల నుంచి పందేలు మొదలై ఆపైనే సాగాయి. సంక్రాంతి 3 పండగుల్లో ఒక్క మురమళ్ల బరిలో రూ.60 కోట్ల మేర పందేలు సాగితే అదే జిల్లాలో రూ.300 కోట్ల మేర నిర్వహించారు. జిల్లా పోలీసులు మాత్రం సంక్రాంతికి కొన్ని బరులను ధ్వంసం చేసినట్లు, కొన్ని కోళ్లను, కొంత నగదును, కోడి కత్తులను సీజ్‌ చేసినట్లు ప్రకటించినా పూర్తి స్థాయిలో నిఘా లోపించడంతో కోడి పందేలు, గుండాటలు, అశ్లీల నృత్యాలు అదుపు తప్పి అడ్డగోలుగా జరిగాయి.

82 కేసుల నమోదు

180 మంది అరెస్ట్‌ ఎస్పీ కృష్ణారావు

జిల్లాలో జోరుగా కోడిపందేలు

మురమళ్ల బరిలో పందేలను

వీక్షించిన ఎంపీలు, ఎమ్మెల్యే

3 పండుగలు...

రూ.300 కోట్ల మేర పందేలు

అమలాపురం టౌన్‌: సంక్రాంతి పండగల సందర్భంగా కోడిపందేలపై ఒక్క భోగి రోజునే జిల్లావ్యాప్తంగా దాడులు చేసి 82 కేసులు నమోదు చేయడంతో పాటు 180 మందిని అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు అమలాపురంలో ఎస్పీ ఓ ప్రకటన విడుదల చేశారు. కోడిపందేలపై 82 కేసులతోపాటు 156 కోళ్లను, 186 కోళ్ల కత్తులను, రూ.83,241 నగదును సీజ్‌ చేసినట్టు పేర్కొన్నారు. కోడికత్తులు కట్టే వారిని, పందేలు నిర్వహించే వారిని, గుండాట ఆడేవారిని, అనుమానితులను గుర్తించి మొత్తం 1,286 మందిని బైండోవర్‌ చేశామని వివరించారు. జిల్లాలో పేకాట ఆడుతున్న బృందాలపై దాడులు చేసి భోగి పండగ ఒక్క రోజే 44 కేసులు నమోదు చేసి 100 మందిని అరెస్ట్‌ చేశామన్నారు. ఆరు ఆటోలు, రూ.52,730 నగదును సీజ్‌ చేశామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించి నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపైన, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైన, అల్లర్లు చేసే వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు. మకర సంక్రాంతి, కనుమ పండగల్లో నిఘా ఉంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ కృష్ణారావు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పోలీజుల సాక్షిగా పందేలు1
1/5

పోలీజుల సాక్షిగా పందేలు

పోలీజుల సాక్షిగా పందేలు2
2/5

పోలీజుల సాక్షిగా పందేలు

పోలీజుల సాక్షిగా పందేలు3
3/5

పోలీజుల సాక్షిగా పందేలు

పోలీజుల సాక్షిగా పందేలు4
4/5

పోలీజుల సాక్షిగా పందేలు

పోలీజుల సాక్షిగా పందేలు5
5/5

పోలీజుల సాక్షిగా పందేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement