కిక్కిరిసిన అంతర్వేది
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహుని క్షేత్రం మంగళ, బుధవారాలలో సంక్రాంతి, కనుమ పర్వదినాలు పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం ఎటు చూసినా భక్తులతో రద్దీగా మారింది. ఆలయంలో నిత్యం నిర్వహించే నారసింహ సుదర్శన హోమంలోను, విశేష అభిషేకంలోను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల క్యూ లను, అన్నదాన పథకాన్ని అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు.
సచివాలయ, వలంటీర్ల
వ్యవస్థలు అస్తవ్యస్తం
అమలాపురం టౌన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన గ్రామ, వార్డు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు కె.సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. వలంటీర్ల కొనసాగింపుపై హామీ ఇవ్వకుండా, సచివాలయ ఉద్యోగుల విభజన, విధి విధానాలు గందరగోళంగా మార్చిందని పేర్కొన్నారు. మూడంచెలుగా సచివాలయ ఉద్యోగులను విభజించాలన్న సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతిపాదనపై ఉద్యోగ సంఘాల నాయకులతో కూలంకషంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
20 నుంచి ఇంటర్ ప్రీ పబ్లిక్
రాయవరం: ఇంటర్మీడియేట్ ప్రీ పబ్లిక్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. 2024–25 విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ఇవి ప్రారంభం కానున్నాయి. జనరల్ కోర్సుల పరీక్షలు జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు.
ఇంటర్‌బోర్డు ప్రశ్న పత్రంతో..
2023–24 ఇంటర్ పబ్లిక్ పరీక్షలు గత ఏడాది మార్చి నెలలో, సప్లిమెంటరీ పరీక్షలను జూన్ నెలలో నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది మార్చి నెలలో ఇచ్చిన మూడు సెట్లలో రెండింటిని మార్చి, జూన్ పరీక్షల్లో వినియోగించగా.. ఒక సెట్ మిగిలింది. మిగిలిన ఆ ఒక సెట్ ప్రశ్న పత్రాన్ని ఈ ప్రీ పబ్లిక్ పరీక్షలకు వినియోగించాలని ఇంటర్మీడియేట్ విద్య కమిషనర్ కృత్తికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ఇంటర్మీడియేట్ విద్య డీవీఈఓ వనుము సోమశేఖరరావు ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 13 ప్రభుత్వ కళాశాలల్లో ఫస్టియర్ 1,069 మంది, ఒకేషనల్ 313, సెకండియర్ 852, ఒకేషనల్ 280 మంది ఉన్నారు. 20న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 22న గణితం–1ఎ, బోటనీ, సివిక్స్, 23న గణితం పేపర్–1బి, జువాలజీ, హిస్టరీ, 24న ఫిజిక్స్, ఎకనామిక్స్, 25న కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment