విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు
రాజోలు: సంప్రదాయంగా నిర్వహించుకునే సంక్రాంతి పండగ రాజోలు నియోజకవర్గంలో అశ్లీల నృత్యాలకు కేంద్రం బిందువుగా మారింది. సంక్రాంతి వేడుకల ముసుగులో అధికార కూటమి నేతలు బరి తెగించి కోడి పందేలు, గుండాట, పేకాట శిబిరాలు పోటాపోటీగా నిర్వహించి అసాంఘిక కార్యక్రమాలను విచ్చలవిడిగా నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధి అసాంఘిక కార్యక్రమాలకు అనధికారికంగా అనుమతులు ఇవ్వడంతో రాజోలు పోలీసులు చేతులేత్తేశారు. రాజోలు మండలం పాలగుమ్మి గ్రామంలో కోడి పందేల వద్ద చోటుచేసుకున్న విభేదాలు ఇరు వర్గాల మధ్య ఘర్షణలకు దారితీశాయి. రాజోలులో కూటమి నేతలకు, రాజోలు సర్పంచ్ రేవు జ్యోతి మధ్య వైరం ముదిరి వేర్వేరు కోడిపందేలు, పేకాట, గుండాట శిబిరాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మధ్యవర్తిత్వంలో సాగునీటి పంపిణీ సంఘ చైర్మన్ పినిశెట్టి బుజ్జి ఇంటి వద్ద పంచాయితీ జరిగింది. ఆ పంచాయితీలో వాటాలు తెగకపోవడంతో మరోమారు ఎమ్మెల్యే వరప్రసాద్ ఇంటి వద్ద రేవు జ్యోతి, చెల్లుబోయిన రాంబాబు, ఇద్దరు టీవీ విలేకర్లు తమకు కోడి పందేలు నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యేను నిలదీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అసాంఘిక కార్యక్రమాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి యువతను పెడదోవ పెడుతున్నారని, పోలీసులకు అందిన ముడుపులపై ఆధారాలతో నిరూపిస్తానని జనసేన నాయకుడు యెనుముల వెంకటపతిరాజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మగటపల్లిలో అశ్లీల నృత్యాలను ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను స్టేజ్‌పై నుంచి నెట్టివేశారు. కాట్రేనిపాడు, పొన్నమండ, మామిడికుదురు మండలం కరవాక, గోగన్నమఠం, మలికిపురం మండలం కేశనపల్లి, పడమటిపాలెం, సఖినేటిపల్లి మండలంలో అంతర్వేది, టేకిశెట్టిపాలెం తదితర ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు నిర్వహించారు.
యథేచ్ఛగా గుండాట, పేకాట శిబిరాలు
పాలగుమ్మిలో ఇరువర్గాల ఘర్షణ
Comments
Please login to add a commentAdd a comment