రాయవరం: విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటల్లోనూ తర్ఫీదునివ్వాలని అధికారులు యోచిస్తున్నారు. పాఠశాలల వారీగా అవసరమైన క్రీడా పరికరాల వివరాలను కోరుతూ సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని పాఠశాలల హెచ్‌ఎంలు ఆన్‌లైన్‌లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వారికి కావాల్సిన క్రీడా పరికరాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రాథమిక పాఠశాలలకు రూ.7వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.14వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.30 వేల విలువైన క్రీడా పరికరాలను అందించనున్నారు.
స్పోర్ట్స్ కిట్‌లో ఇచ్చే పరికరాలివీ..
ప్రాథమిక పాఠశాలలకు క్యారమ్ బోర్డు, చెస్, క్రికెట్, రోప్ స్కిప్పింగ్, స్పోర్ట్స్, వాలీబాల్, వేయింగ్ మెషీన్ ఇలా వారికి అవసరమైన ఆటవస్తువులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వాలీబాల్, వాలీబాల్ నెట్, ఫుట్‌బాల్, త్రో బాల్, త్రోబాల్ నెట్, బాల్‌బ్యాడ్మింటన్ బ్యాట్ లు, క్రికెట్ కిట్, హైజంప్ పోల్స్, డిస్క్‌త్రో, జావలిన్, చెస్, క్యారమ్ బోర్డు, టెన్నికాయిట్ రింగ్స్, స్కిప్పింగ్ రోప్స్, యోగా మ్యాట్స్, సాఫ్ట్‌బాల్ గ్లోవ్స్, స్లగ్గర్, టెన్నిస్ టేబుల్, హేండ్‌బాల్స్, హేండ్‌బాల్ నెట్, హాకీ స్టిక్స్, వేయింగ్ మెషీన్, కబడ్డీ ఏంకిల్ క్యాప్స్, నీ ప్యాడ్స్, షటిల్ రాకెట్స్, బ్యాడ్‌మింటన్ కాక్స్ తదితర 55 రకాల ఆట వస్తువులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించింది. స్థానికంగా విద్యార్థులు ఆడుకునేందుకు వీలుగా ఉన్న ఆటవస్తువులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు క్రీడా పరికరాల నిమిత్తం ఇండెంట్‌ను నమోదు చేశారు. 1,276 ప్రాథమిక, 69 ప్రాథమికోన్నత, 239 ఉన్నత పాఠశాలలు క్రీడా పరికరాలకు ఇండెంట్‌ను నమోదు చేశారు.
భీమేశ్వరాలయ నిత్యాన్నదాన
పథకానికి రూ.లక్ష విరాళం
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన దాత పుప్పాల అజయ్‌కుమార్ గురువారం రూ. 1,00,116లు విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్‌ను ఆలయ సీనియర్ సహాయకుడు సూరపుపురెడ్డి వెంకటేశ్వరరావు(వెంకన్నబాబు) చేతికి అందజేశారు.
21, 22 తేదీలలో
కోనసీమ క్రీడోత్సవాలు
అమలాపురం రూరల్: ఈ నెల 21, 22 తేదీలలో జిల్లాస్థాయిలో ‘కోనసీమ క్రీడోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట మైన ఏర్పాట్లను చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ, క్రీడా ప్రాధికార సంస్థ, కలెక్టరేట్ అధికారులతో జిల్లాస్థాయి కోనసీమ క్రీడోత్సవాలు, ఆరోగ్యం కార్యక్రమాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో గెలుపొందిన 7, 8, 9 తరగతుల క్రీడాకారులకు జీఎంసీ బాలయోగి స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఈనెల 21, 22 తేదీలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 2,700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఫైనల్‌కు చేరిన మూడు డివిజన్ల బృందాలు జిల్లా స్థాయిలో పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు. అథ్లెటిక్స్ గేమ్స్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్ పోటీలు జిల్లా స్థాయిలో నిర్వహించి ఈనెల 22వ తేదీ సాయంత్రం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు బహుకరించనున్నట్లు తెలిపారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ కే. మాధవి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు పీఎస్.సురేష్ కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ పి.రామకృ ష్ణారెడ్డి, స్కూల్ సెక్రటరీ శ్రీనివాస్, పీఈటీ అసోసియేషన్ కార్యదర్శి బీవీఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు.
రత్నగిరిపై భక్తజనవాహిని
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి గురువారం కిక్కిరిసింది. సంక్రాంతి పండగలకు స్వస్థలాలకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో భాగంగా మార్గం మధ్యలో సత్యదేవుని దర్శించుకుంటున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరిగింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని మొత్తం 40 వేల మంది దర్శించారు. సుమారు 2 వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలు, పట్టు వస్త్రాలతో దర్శనమిస్తారు. ప్రతి గురువారం మాత్రం నిజరూపాలతో దర్శనమిస్తారు. ఆ విధంగా సత్యదేవుని నిజరూప దర్శనం చేసుకున్న భక్తులు పులకించారు.
Comments
Please login to add a commentAdd a comment