ముగిసిన పెద్దల పండగ!
పండగ ముగిసిపోవడంతో బోసిపోయిన పల్లెలు : అంబాజీపేట మండలం గంగలకుర్రులో పరిస్థితి
● పెరిగిన ధరలతో సామాన్యులు
సంక్రాంతికి దూరం
● అసలు వ్యాపారాలు వెలవెల
● అడుగడుగునా జూదం.. అశ్లీల నృత్యాలు
● కూటమి నేతలకు..
ఖాకీలకు కాసుల గలగల
● బోసిపోయిన పల్లెలు
● అతిథులు.. బంధువుల తిరుగు ప్రయాణం
సాక్షి, అమలాపురం : పెద్ద పండగ అయిపోయింది. సందడి ఆగిపోయింది. సందడి అంతా మాదే అంటూ పాటలు పాడిన హరిదాసులు, గంగిరెద్దుల వారు ఆగిపోయారు. వారం రోజులుగా ముగ్గులతో కళాకళలాడిన వీధులు గురువారం వేసిన రథాల ముగ్గులతో టాటా చెప్పాయి. పిల్లల కేరింతలతో కళకళలాడిన పొలం గట్లు దీనంగా చూస్తున్నాయి. సెలవులు ముగించుకుని పట్టణానికి బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థులు ఏదో కోల్పోయిన భావనలో ఉన్నారు. ప్రభల తీర్థాలు.. భక్త జన ఘోష.. డీజేలు ఆగిపోయాయి. దీనితో పల్లె మూగపోయింది. ఇళ్ల వద్ద సంప్రదాయ పద్ధతిలో పండగ సాగిపోయింది. కానీ కూటమి పాలన పుణ్యమాని జరగాల్సిన చోట వ్యాపారాలు జరగలేదు. వస్త్రాలు, బంగారం, నిత్యావసర వస్తువులు వంటివి కొనేవారు లేక వ్యాపారుల వద్ద గల్లా పెట్టెలు ఖాళీగా ఉంటే.. మద్యం.. జూదం.. అశ్లీల నృత్యాలు వంటి చోట మాత్రం కాసులు గలగల లాడాయి.
పచ్చని సీమలో ముక్కనుమతో నాలుగు రోజుల పండగ ముగిసింది. కొత్త అల్లుళ్లే కాదు... బతుకు తెరు వు కోసం దూరాన ఉంటూ పండగకు వచ్చిన వారు సైతం ఆప్యాయతానురాగాలు... ఆతిథ్య మర్యాదల తో తడిసి ముద్దయ్యారు. సంక్రాంతి మూడు రోజుల పండగ అంటారు గాని ముక్కనుమతో కలిపి నాలుగు రోజులు. అది కూడా పూర్తి కావడంతో పండగకు వచ్చిన ఇతర ప్రాంతవాసులలో చాలామంది తిరుగు ముఖం పట్టారు. సెలవులు దొరికినవారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు మాత్రం ఆదివారం రాత్రి బయలుదే రి వెళ్లనున్నారు. ముక్కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదని సెంటిమెంట్ ఉండేవారు మాత్రం బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.
సామాన్యులకు భారం
వ్యవసాయం.. ఆక్వా దెబ్బతిని రైతులు, సంక్షేమ పథకాలు ఆగిపోయి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు.. సామాన్యులు.. పేదలు పండగకు దూరంగా ఉన్నారు. ఈ ప్రభావం వ్యాపారాలపై ప్రభావం చూపించింది. మరీ ముఖ్యంగా వస్త్ర, బంగారం వంటి వ్యాపారాలు జిల్లాలో సగానికి సగం పడిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం కూడా పండగ కళకళను తగ్గించేశాయి. చివరకు కూరగాయ ధరలు సైతం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. మాంసాహార ప్రియులకు చుక్కలనంటిన కోడి, మాంసం ధరలు ముక్క గొంతు దిగకుండా చేశాయి. పందెం కోడి మాంసం ‘కొస‘ ధర పులసను మించింది. ఇతర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు పండగకు రావడం నుంచి తిరిగి వెళ్లడం వరకు ప్రయాణాలు భారాన్ని మిగిల్చాయి. ప్రైవేటు బస్సుల దోపిడీ నిర్విఘ్నంగా సాగిపోయింది. రానూపోనూ టిక్కెట్ ధరలు కోనసీమ కేంద్రమైన అమలాపురం నుంచి హైదరాబాద్‌ల మధ్య రూ.2 వేల నుంచి రూ.3 వేలు పలికాయి.
అసలు పండగ పచ్చ చొక్కా.. ఖాకీలదే
కోనసీమ జిల్లాలో పండగ సందడి గ్రామాల్లో కన్నా పందేల బరులు.. అశ్లీల నృత్యాల వద్దనే అధికంగా కనిపించింది. ఒకవైపు వ్యాపారాలు జరగలేదని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధరలతో పండగ సంతృప్తిగా చేసుకోలేదని మరోవైపు సామాన్యులు వాపోతున్నారు. కాని అసలు పండగ మాత్రం కూటమి నేతలదే. విచ్చలవిడిగా సాగిన జూదం.. అశ్లీల నృత్యాలు కాసులు కురిపించాయి. కోడిపందేల బరులకు నేతలు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల చొప్పున వసూలు చేయగా, ఖాకీలు సైతం ఎక్కడా రాజీ పడలేదు. బరులు వారికి సిరులు కురిపించాయి. ఒక్కొక్క పందేం బరికి ఆరు చొప్పున ‘కోస’ మాంసం కోళ్లు అదనంగా సమర్పించుకున్నారు. కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలోనూ కోడిపందేలు నిర్వహించారు. కూటమి పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు బరులు నిర్వాహకులుగా మారిపోయి సొమ్ము చేసుకున్నారు. కొన్ని చోట్ల స్వయంగా కూటమి పార్టీకి చెందిన నియోజకవర్గ నేతలే సొంతంగా బరులు ఏర్పాటు చేశారు. కోడిపందేలు, గుండాటలు, పేకాటలు, సింగల్, లోనా.. బయటా, పోట్టేళ్ల పందేలు... ఇలా సర్వం జూదంగా మార్చారు. ఒక నేత బరుల వద్ద బెల్టుషాపులు, చికెన్ పకోడీ, చిన్న చిన్న పాన్‌షాపులను నుంచి సైతం సొమ్ము వసూలు చేయడం తెలిసి జనం ముక్కున వేలేసుకున్నారు. ఐ.పోలవరం మండలం మురమళ్ల, ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద కోడిపందేల బరులు లాభసాటిగా మార్చేందుకు ఆ మండలాల్లో మిగిలిన చోట్ల పెద్దగా బరులు లేకుండా చేయడం గమనార్హం. రాజోలు దీవిని అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చి వేశారు. ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు చెలరేగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment