ఘనంగా అంబాజీపేట ప్రభల తీర్థం
అంబాజీపేట : సంక్రాంతి సందర్భంగా అంబాజీపేట సెంటర్లో ఏటా ముక్కనుమ రోజున నిర్వహించే ప్రభల తీర్థం (చక్ర తీర్థం) గురువారం అత్యంత ఘనంగా జరిగింది. మాచవరంలోని రామ్‌ఘాట్‌లో వేంచేసియున్న శ్రీపార్వతీ రాజేశ్వరస్వామి, కందుల మల్లేశ్వరస్వామి, యువగణపతి ఆలయాల వద్ద నుంచి ప్రభలను పురవీధుల్లో గౌడ యువసేన యువకులు ఊరేగింపుగా అంబాజీపేట సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడ కొలువుతీరిన ప్రభలను భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. సెంటర్లో ఏర్పాటు చేసిన తీర్థానికి మండలంలోని పలువురు తరలివచ్చారు. ఎస్సై కె.చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. తీర్థం ముగిసిన అనంతరం ప్రభలతో గ్రామోత్సవం నిర్వహించారు. తీర్థంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ఆర్కెస్ట్రా పలువురిని అలరించాయి. ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యానారాయణ, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు ప్రభలను దర్శించుకున్నారు.
నియమాలు పాటిస్తే
ప్రమాదాల నివారణ
అమలాపురం రూరల్: వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ ఆర్. మహేష్‌కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వతేదీ వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు –2025 కరపత్రాన్ని ఆయన గురువారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వాహనాలు కండీషన్లో ఉండకపోవడం, అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు. ఏటా నమోదయ్యే మరణాల్లో 40శాతం రోడ్డు ప్రమాదాలేనన్నారు. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు ద్విచక్ర వాహనదారుడు, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు. జిల్లా రవాణా అధికారి డి. శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర, మున్సిపల్ కమిషనర్ రాజు, మోటార్ వాహనాల తనిఖీ అధికారులు రవికుమార్, జ్యోతి, సురేష్, కాశీ విశ్వే శ్వరరావు, కౌశిక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment