పారానిషారు!
● పండగకు ఫుల్లుగా తాగేశారు
● సంక్రాంతికి భారీగా మద్యం అమ్మకాలు
● మూడు రోజుల్లో రూ.7.02 కోట్ల వ్యాపారం
రాయవరం: ఏ శుభకార్యమైనా..పండగైనా..ఆదివారమైనా మద్యం ఏరులై పారుతుంది. సంక్రాంతి సందర్భంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ఆదివారం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లాలో ఉన్న దుకాణాలు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించింది. ఇటీవల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా రూ. 3.11 కోట్ల వ్యాపారం జరిగితే..ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల్లో రూ. 7.02 కోట్ల వ్యాపారం జరిగింది. పండగకు నాలుగు రోజుల ముందే జిల్లాకు చెందిన మద్యం వ్యాపారులు అమలాపురం, రాజమహేంద్రవరం మద్యం డిపోల నుంచి పెద్ద ఎత్తున సరకు కొనుగోలు చేశారు.
పండగ చేసుకున్న మద్యం ప్రియులు
సంక్రాంతి సందర్భంగా జిల్లాలో మద్యం ప్రియులు పెద్ద పండగ చేసుకున్నారు. మర్యాదలు, విందుల పేరిట పీకల దాకా మందు తాగి చిందులేశారు. జిల్లాలో ఎక్కడ చూసినా మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. పల్లెలు, పట్టణాలు అనే భేదం లేకుండా జిల్లా అంతటా మద్యం గోదావరితో సమానంగా పరవళ్లు తొక్కింది. సంక్రాంతి పర్వదినాల్లో పందేలతో పాటు మద్యం కూడా ముఖ్య భూమిక పోషించింది. వ్యాపారులకు కాసుల వర్షం కురిపించింది.
ఆ రోజుల్లోనే..
ఏడాదిలో మద్యం అమ్మకాలు జనవరి మొదటి పక్షంలోనే ఎక్కువగా సాగుతాయి. గతేడాది డిసెంబర్ 31వ తేదీ నుంచి సంక్రాంతి పర్వదినం వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. కొత్త సంవత్సరం, భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. జిల్లాలోని ఎకై ్సజ్ శాఖ పరిధిలో 133 మద్యం షాపులున్నాయి. అధికారికంగా ఉన్న మద్యం షాపులతో పాటుగా, కూటమి ప్రభుత్వం వచ్చాక అనధికారికంగా బెల్టుషాపులు ఊరూరా కొనసాగుతున్నాయి.
రూ.50 కోట్ల అమ్మకాలు..
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి 15 వరకు అమలాపురం మద్యం డిపో ద్వారా 44,728 ఐఎంఎల్, 22,071 కేసుల బీరు విక్రయాలు సాగాయి. అంటే రూ.34,28,74,197 విక్రయాలు జరిగాయి. ఈ నెల 14, 15 తేదీల్లో మద్యం డిపోకు సెలవు కావడంతో భోగి రోజు వరకు మద్యం షాపుల యజమానులు సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు చేపట్టారు. అమలాపురం మద్యం డిపో పరిధిలోని 95 మద్యం షాపుల ద్వారా ఈ అమ్మకాలు జరిగాయి. మిగిలిన 38 మద్యం షాపులు రాజమహేంద్రవరం మద్యం డిపో ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నాయి. ఈ షాపుల ద్వారా దాదాపుగా రూ.16కోట్ల అమ్మకాలు జరిగినట్లు అంచనా. న్యూఇయర్ వేడుకలు, సంక్రాంతి పండుగల పేరిట అమ్మకాలు బాగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment